సందడిగా ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీ ఫైనల్స్‌

Telangana: Sakshi Spell Bee Semi Final Held In KPHB Colony

మూసాపేట/హైదరాబాద్‌: ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీఫైనల్స్‌ పోటీలు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని మెరిడియన్‌ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలకు హాజరయ్యారు.

నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్‌లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్‌లో పోటీ పడ్డారు. మెయిన్‌ స్పాన్సర్స్‌గా డ్యూక్‌ వప్పీ అసోసియేషన్‌ స్పాన్సర్‌గా ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు.  

ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది 
‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్‌ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది.  –వకుళ, మీర్‌పేట్‌ విద్యార్థిని తల్లి 
 
కొత్త పదాలు తెలుసుకున్నా 
‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను.  స్పెల్‌ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్‌ వరకు రావటం ఆనందంగా ఉంది.  
– సహస్ర మారెడ్డి, మీర్‌పేట్‌ 

చాలా విషయాలు తెలిశాయి 
ఖమ్మంలోని ప్రైవేట్‌ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్‌ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్‌లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి.  
–హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని 
 
 పోటీతత్వం పెరుగుతుంది 
‘సాక్షి’ స్పెల్‌బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.  ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. 
– అరుణ, విద్యార్థిని తల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top