Telangana: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు

Telangana: Reservations in Issuance of Liquor Store Licenses - Sakshi

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. 

గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు 

పోడు, ధరణి, పోలీసు సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీలు 

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు

మూడు అంశాలపై సబ్‌ కమిటీలు 
పోడు భూముల సమస్యపై సమగ్ర అధ్యయనం, పరిష్కారాల అన్వేషణ, సిఫారసుల కోసం గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో.. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌తో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. 
కొత్త జిల్లాల్లో అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడంపై అధ్యయనానికి హోంమంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో.. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో సబ్‌ కమిటీని ప్రకటించారు.  
ధరణి పోర్టల్‌లో తలెత్తున్న సమస్యలను గుర్తించి, పరిష్కారాలను సిఫారసు చేయడానికి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. 

పంట కొనుగోళ్లకు సిద్ధంకండి 
రాష్ట్రంలో ఇటీవలి వానలు, పంటల సాగువిస్తీర్ణం, దిగుబడుల అంచనాలు, పంట కొనుగోళ్లపై మంత్రివర్గం చర్చించింది. పంటల కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనిని వచ్చే ఏడాది (కొత్త ఆబ్కారీ సంవత్సరం) నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ లైసెన్సులతో నిర్వహించే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇటీవల ‘దళితబంధు’ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు.. మద్యం షాపుల్లో కోటాపై నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 

వైద్యారోగ్యంపై సమగ్ర ప్రణాళిక 
రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. తదుపరి కేబినెట్‌ సమావేశానికల్లా ప్రణాళికను అందజేయాలని సూచించింది. వచ్చే ఏడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని వైద్య, రోడ్లు–భవనాల శాఖలను ఆదేశించింది. హైదరాబాద్‌ నగరంలో తలపెట్టిన నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గురువారం నుంచి ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, రోజూ 3 లక్షల మందికి టీకాలు అందేలా చూడాలని కేబినెట్‌ నిర్దేశించింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 130 టన్నుల నుంచి 280 టన్నులకు పెంచామని.. దీనిని 550 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. 


నీకే సన్మానం చేయాలి...
మద్యం దుకాణాల్లో గౌడలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌ను సన్మానించాలని అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెళ్లారు. అయితే, ఇందుకు నీకే సన్మానం చేయాలని పేర్కొన్న సీఎం.. శ్రీనివాస్‌గౌడ్‌ను శాలువాతో సన్మానించారు.  

గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు 
రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం.. ఈ ఏడాది ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది. రహదారుల మరమ్మతులు వేగంగా చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించింది. 

రాజాబహద్దూర్‌ సొసైటీకి స్థలం 
రాజాబహద్దూర్‌ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ విజ్ఞప్తి మేరకు.. హైదరాబాద్‌లోని నారాయణగూడలో బాలికల వసతి గృహం నిర్మాణం కోసం 1,261 గజాల స్థలాన్ని నామమాత్రపు ధరకు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

రెండు కొత్త ఎత్తిపోతలకు ఆమోదం 
సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
సింగూరు రిజర్వాయర్‌ కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 231 గ్రామాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి సంగమేశ్వర పథకాన్ని చేపట్టనున్నారు. దీన్ని రూ.2,653 కోట్లతో నిర్మించనున్నారు. 
సింగూరు రిజర్వాయర్‌ ఎడమ వైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. నారాయణ్‌ఖేడ్, ఆందోల్‌ నియోజకవర్గాల్లోని 166 గ్రామాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి బసవేశ్వర పథకాన్ని ప్రతిపాదించారు. రూ.1,774 కోట్లతో దీన్ని చేపట్టనున్నారు. 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న నృసింహసాగర్‌ (బస్వాపూర్‌ జలాశయం) కోసం నాబార్డు నుంచి రూ.2,051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు 
వారం రోజులు శాసనసభ, మూడు రోజులు మండలి భేటీలు! 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ వానాకాల సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులు శాసనసభ, మూడు రోజుల పాటు శాసన మండలి భేటీలు జరిగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాల సమాచారం. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం చైర్మన్‌ సమావేశ ఏర్పాట్లపై సమీక్షించనున్నట్టు తెలిసింది. ఈసారి సమావేశాల్లో ‘దళితబంధు’ పథకానికి చట్టబద్ధత, వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది శాసనసభ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజైన మార్చి 26న అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మళ్లీ జూన్, జూలై నెలల్లో సమావేశాలు జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాలేదు. అయితే శాసనసభ సమావేశాల మధ్య ఆరునెలలకు మించి విరామం ఉండకూడదన్న నిబంధన ఉంది. దీంతో ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో సందర్శకులు, మీడియా, ఇతర సిబ్బందిని అనుమతించే అవకాశం ఉంది. 
    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top