తాత్కాలిక కోటా పునఃసమీక్ష కోసం మళ్లీ రిఫర్ చేయాలన్న తెలంగాణ
30న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో జరగనున్న చర్చ
గతంలో 66:34 నిష్పత్తిలో అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక కేటాయింపులు
50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలంటున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను తాత్కాలికంగా పంపిణీ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ 2015లో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీనిపై బోర్డు చైర్మన్ శుభ్‌రంగ్‌షు బిస్వాస్ అధ్యక్షతన ఈ నెల 30న జరిగే 21వ సమావేశంలో చర్చించనుంది. సమావేశం ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచిన బోర్డు.. ఏపీ ఎలాంటి ఎజెండా ప్రతిపాదించలేదని తెలిపింది.
ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని గతేడాది జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మినట్స్‌లో పేర్కొనడంపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను సైతం తాజా సమావేశ ఎజెండాలో బోర్డు చేర్చింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని తెలంగాణ చేసిన డిమాండ్‌ను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించాలని బోర్డు గతంలో ఓసారి తీర్మానించినప్పటికీ ఇప్పటివరకు కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి అపెక్స్ కౌన్సిల్‌కు ఈ అంశాన్ని రిఫర్ చేయాలని తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై బోర్డు చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కృష్ణా బోర్డు విజ్ఞప్తితో అపెక్స్ కౌన్సిల్‌ను కేంద్రం సమావేశపరిచే అవకాశం ఉంది.
పోతిరెడ్డిపాడు, బనకచర్లపై టెలిమెట్రీలు...
శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు ఏపీ లైనింగ్ పనులు చేస్తుండటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం నీటిని కచ్చితత్వంతో లెక్కించడం సాధ్యం కావట్లేదని.. అందువల్ల పోతిరెడ్డిపాడు, బనకచర్ల కాంప్లెక్స్ అవుట్‌లెట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది.
తెలంగాణ పోలవరం విస్తరణను అడ్డుకోవాలి..
పోలవరం–నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లు నిర్వహించకుండా అడ్డుకోవాలని, ప్రాజెక్టు ప్రీ–ఫీజిబులిటీ నివేదికను పరిశీలించరాదంటూ తెలంగాణ చేసిన మరో విజ్ఞప్తిపైనా బోర్డు తాజా భేటీలో చర్చించనుంది. శ్రీశైలం జలాశయం నుంచి బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ తరలిస్తున్న జలాలను సైతం ఆ రాష్ట్ర వాటా కింద లెక్కించాలని తెలంగాణ చేస్తున్న మరో డిమాండ్‌పైనా చర్చ జరగనుంది.
సాగర్‌ను తెలంగాణకు అప్పగించాలి...
నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తిరిగి తమకు అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌పై బోర్డు చర్చించనుంది. మరమ్మతుల నిర్వహణకు తమ అధికారులను ఏపీ అనుమతించకపోవడంతో డ్యామ్ భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలంగాణ వాదిస్తోంది.
ఎజెండాలో ఇతర ముఖ్యాంశాలు...
శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌కు ఏర్పడిన భారీ గుంతను పూడ్చాలన్న నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం తక్షణమే డ్యామ్‌కు మరమ్మతులు నిర్వహించాలి.
» శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించాలి. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి.
» రాయలసీమ ఎత్తిపోతల పనుల విషయంలో వాస్తవ పరిస్థితిపై బోర్డు నివేదిక తెప్పించుకోవాలి.
» అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వ లైనింగ్ పనులపై నివేదిక కోరాలి.
» నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలను లెక్కించడానికి తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి.
» నీటిని పొదుపుగా వాడుకొని నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేస్తున్నందున ఆ జలాలను వచ్చే ఏడాది వాడుకోవడానికి బోర్డు వీలు కల్పించాలి.
» తాగునీటి కోసం వాడుకుంటున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించి మిగిలిన 80 శాతాన్ని రిటర్న్ ఫ్లోగా పరిగణిస్తూ మినహాయింపు కల్పించాలి.


