
ఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై(Telangana BC Reservations) అంశంపై నేడు సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్ మనుసింఘ్వీతో వాదనలు వినిపిస్తాం. బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. సీపెక్ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు. ఇతరుల రిజర్వేషన్లను మేము లాక్కోవడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే మా ఉద్దేశం’ అని తెలిపారు.