ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి

Telangana Minister KTR Speech On JNTU Golden Jubilee Anniversary - Sakshi

జేఎన్‌టీయూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ వార్షికోత్సవంలో విద్యార్థులకు కేటీఆర్‌ పిలుపు  

కేపీహెచ్‌బీ కాలనీ: విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జేఎన్‌టీ యూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ వార్షికోత్సవం పురస్కరించుకొని ‘‘ఇన్నోవేషన్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’’అనే అంశంపై గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

మేధస్సు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణల వైపు మొగ్గుచూపాలని సూచించారు. సరికొత్త ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా టీహబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రోజుకు 24 గంటలపాటు విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సదుపాయం, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై అన్ని పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత పారిశ్రామిక అభివృద్ధికి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ అనే మూడు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని విధానాలు రూపొందించాలని తాను సూచించినట్లు తెలిపారు. 

మౌలిక వసతుల సద్వినియోగం ఏదీ..
దేశంలో ఉన్న మౌలిక వసతులన్నింటినీ సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొందని కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. దేశంలోనే వివిధ రూపాల్లో నాలుగు లక్షల ఆరువేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా గరిష్టంగా వినియోగించే విద్యుత్‌ రెండు లక్షల పన్నెండు వేల మెగావాట్లు మాత్రమేనని తెలిపారు. అయినప్పటికి విద్యుత్‌ ఉత్పత్తిలో దేశం వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పారిశ్రామికవేత్త పద్మశ్రీ బి.వి.మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top