కాంగ్రెస్‌లో చేరికల పోరు!  | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరికల పోరు! 

Published Mon, Jun 27 2022 2:02 AM

Telangana: Many Leaders Joining In Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికలు ఒకవైపు కేడర్‌లో నూతనోత్తేజం నింపుతుంటే మరోవైపు నేతల మధ్య వర్గపోరు పెరుగుతోంది. పార్టీలో చేరాలనుకున్న వారంతా గాంధీభవన్‌లో చేరాల్సి ఉండగా అందుకు భిన్నంగా కీలక నేతల ఇళ్లలో ఎవరికి వారుగా చేరడం గందరగోళానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన చేరికలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  

పీసీసీ, సీఎల్పీ, స్టార్‌ క్యాంపెయినర్‌... 
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్‌ కార్యాలయంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకర్గానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా మంచిర్యాల జిల్లాకు చెందిన మరికొందరు నేతలు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్‌ అయిన తుంగతుర్తి రెబల్‌ నేత డాక్టర్‌ వడ్డెపల్లి రవి... కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు.  

గాంధీభవన్‌ చేరికల్లో కనిపించని కీలక నేతలు 
ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు పార్టీలో చేరేందుకు గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్‌తోపాటు మెట్‌పల్లి జెడ్పీటీసీ రాధాశ్రీనివాస్‌రెడ్డి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ బీజేపీ నేత రావి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి మినహా సీనియర్‌ నేతలెవరూ అక్కడ లేరు. 

సస్పెన్షన్‌లో ఉన్న వారిని ఎలా..? 
గత ఎన్నికల సమయంలో రెబెల్‌ అభ్యర్థిగా ఉన్న తుంగతుర్తి నేత డాక్టర్‌ వడ్డెపల్లి రవిని పార్టీలోకి ఎలా ఆహ్వానించారని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి అద్దంకి దయాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డెపల్లి రవిని పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేసిందని గుర్తుచేసిన ఆయన... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఎలా చేరారని ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  

చేరికల కమిటీ చైర్మన్‌ జానారెడ్డి ఎక్కడ? 
పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోకూడదన్న వ్యవహారంపై మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ఓ కమిటీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న చేరికలకు జానారెడ్డి దగ్గర చర్చ జరిగిందా లేదా అనే దానిపై ఏ నాయకుడికీ స్పష్టత లేదు. ఏదో పేరుకే కమిటీ వేసి జానా రెడ్డిని బాధ్యుడిగా పెట్టారని, చేరికల అంశాలేవీ ఆయన దృష్టికి వెళ్లడంలేదని పార్టీలోని సీనియర్లు చెబుతున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement