Telangana: ఇంటర్‌ పరీక్ష గంటన్నరే!

Telangana Intermediate First Year Exam Likely to be Conducted - Sakshi

ఫస్టియర్‌ పరీక్షలకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సెకండియర్‌ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్‌ చేశారు. మరి ఫస్టియర్‌ విద్యార్థులకు ఏ ప్రాతిపదిక లేకపోవడం, 35 శాతం మార్కులు తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలను రద్దు చేసి, సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఒకవేళ ఈ ఏడాది మళ్లీ వైరస్‌ విజృంభించి మరోసారి పరీక్షలను రద్దు చేయాల్సి వస్తే పరిస్థితి గందరగోళంగా మారనుంది. అదీగాక వీరికి మార్కులు కేటాయించడమూ కష్టమే. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉండటంతో సెకండియర్‌ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top