తుది కేటాయింపులు చేయండి

Telangana High Court Mandate to Central On Allocations Of DSP and ASP Posts - Sakshi

డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీల కేటాయింపులపై హైకోర్టు 

ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలి 

కేంద్రానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. డీఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ (నాన్‌ కేడర్‌) పోస్టులకు తుది కేటాయింపులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వీరి నుంచి తాజాగా ఆప్షన్స్‌ కూడా తీసుకోవచ్చని సూచించింది. ఉన్నతాధికారుల పునర్విభజన సలహా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, పునర్విభజన చట్టం నిబంధనల మేరకు కేటాయింపులు చేసి తెలంగాణ, ఏపీ హోం శాఖ, డీజీపీలకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని, ఇందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతోపాటు డీజీపీలు సహకరించాలని స్పష్టం చేసింది. తనను ఏపీకి కేటాయించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కర్నూల్‌ జిల్లాకు చెందిన డీఎస్పీ జి.నాగన్న దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

ఇది ఒక్కరికి చెందింది కాదు.... 
తనను ఏపీకి కేటాయించాలంటూ నాగన్న పిటిషన్‌ దాఖలు చేసినా.. ఇరు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. తుది కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటో చెప్పాలంటూ పలు పర్యాయాలు గడువు ఇచ్చినా వాదనలు వినిపించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే ఆరువారాలు గడువు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్‌ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన సీనియారిటీ జాబితాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కేంద్రం మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించే పరిధి కేంద్రానికి ఉన్నా పట్టనట్లుగా వ్యవహరించిందని పేర్కొంది.  

నాగన్నను విధుల్లోకి తీసుకోవాలి.... 
తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు కేటాయించిన డీఎస్పీ జి.నాగన్నను తుది కేటాయింపుల్లో కేంద్రం ఏపీకి కేటాయిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల్లో జాప్యంతో పదోన్నతులు, ఇతర అలవెన్స్‌లు, పదవీ విరమణ బెనిఫిట్స్‌ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల్లో జాప్యానికి కారణమైన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు రూ.5 వేల చొప్పున నాగన్నకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top