అది రాజ్యాంగ విరుద్ధం 

Telangana High Court Given Sensational Verdict Regarding Division Of Employees - Sakshi

ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజనపై హైకోర్టు సంచలన తీర్పు 

ఉద్యోగుల విభజనకు రాష్ట్రం ఏర్పాటైన తేదీనే ప్రాతిపదిక 

హైకోర్టు ఏర్పడిన తేదీ ప్రాతిపదికగా ఉద్యోగుల విభజన చెల్లదు 

ఆ ఉద్యోగులకు రెండేళ్ల జీతభత్యాలు, అలవెన్స్‌లు చెల్లించండి 

పెన్షన్‌ మదింపులోనూ 60 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోండి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజనకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా, పునర్విభజన చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల విభజనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన (అపాయింటెడ్‌ డే) జూన్‌ 2, 2014ను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 77కు విరుద్ధమని తేల్చిచెప్పింది. హైకోర్టు ఏర్పడిన తేదీ ప్రాతిపదికగా విభజన ప్రక్రియ చేపట్టడంతో 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని తెలిపింది. 2014 జూన్‌ 2వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల నుంచి ఆప్షన్స్‌ తీసుకొని విభజన ప్రక్రియ పూర్తిచేసి ఉంటే..పిటిషనర్లు 60 ఏళ్లకు పదవీ విరమణ చేసేవారని పేర్కొంది.

2019 జనవరి 1 నుంచి 60 ఏళ్లు పూర్తయ్యే వరకు పిటిషనర్లకు రావాల్సిన జీతభత్యాలను 6 శాతం వడ్డీతో ఎనిమిది వారాల్లో చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఏపీ, తెలంగాణ æప్రభుత్వాలు సమానంగా భరించాలని తీర్పులో స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు పూర్వ ఉద్యోగులు కె.బలరామరాజు, మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. తీర్పులో ఇంకా ఏమన్నారంటే.. పిటిషనర్ల పెన్షన్‌ మదింపునకు కూడా 60 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినట్లుగా పరిగణనలోకి తీసుకొని 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, పిటిషనర్ల సర్వీసు రికార్డులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అలాగే ఆప్షన్‌ ఇచ్చే అవకాశం తిరస్కరించినందుకు ఒక్కో పిటిషనర్‌కు రూ.3 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రెండు హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్స్‌కు జరిమానా విధించింది.  

వివక్షత చూపించడం సరికాదు.. 
‘‘న్యాయాధికారుల విభజనకు సంబంధించి 2017 జూలై 8న జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 జూన్‌ 2 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి ఆప్షన్స్‌ తీసుకున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి హైకోర్టు అధికారులు, ఉద్యోగుల విషయంలో మాత్రం 2018 నవంబర్‌ 1 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి మాత్రం ఆప్షన్స్‌ తీసుకోవడం వివక్షత చూపించడమే. ఇందుకు సహేతుకమైన కారణాలను కూడా చూపించలేదు. 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా అధికారులు, ఉద్యోగుల సర్వీసును 60 ఏళ్ల వరకు కొనసాగించాలన్న ఫుల్‌ కోర్టు నిర్ణయం సరైనది కాదు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, వివక్షతాపూరితంగా హైకోర్టు ఆప్షన్స్‌ తీసుకుంది. సెక్షన్‌ 77(2) ప్రకారం అపాయింటెడ్‌ డే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. ఏ రాష్ట్రంలో పనిచేయాలో కోరుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తోంది. 2014 జూన్‌ ప్రాతిపదికగా వీరి కేటాయింపులు పూర్తిచేసి ఉంటే పిటిషనర్లు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కూడా పొందేవారు. తమకు జరిగిన అన్యాయంపై 2019 జూలై 6న పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. 2020 జూలై 30కి వీరికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈలోగానే తీర్పు ఇవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తోపాటు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపించడంలో జాప్యంలాంటి ఇతర కారణాలతో తీర్పు ఇవ్వలేకపోయాం. 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేసినా వారికి జీతభత్యాలు, పెన్షన్‌ పొందే హక్కు ఉంది’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top