హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. ఈరోజు(మంగళవారం) ఆర్టీసీ జేఏసీ నేతలతో మూడు గంటల పాటు జరిగిన చర్చలు విఫలయత్నంగానే ముగిశాయి. దాంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం అర్ధరాత్ని నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌కు సిద్థమైన తరుణంలో ప్రభుత్వం హుటాహుటీనా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సదరు కమిటీ.. ఆర్టీసీ జేఏసీకి విన్నవించింది. అయితే దీనికి ఆర్టీసీ జేఏసీ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యలపై తక్షణమే ప్రకటన చేయాలనే డిమాండ్‌తో ఆర్జీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. నేటి అర్థరాత్రి వరకూ ప్రభుత్వానికి సమయం ఉందని కూడా జేఏసీ మరోసారి స్పష్టం చేసింది.

కాగా, ప్రధానంగా పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. అర్థరాత్రి వరకూ ఎటువంటి స్పషటత రాకపోతే ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు. ఈ సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు.


