
‘విజిటర్ ఈ–పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం’ అమలు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సందర్శకులకు ఇకనుంచి ‘విజిటర్ ఈ–పాస్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం క్యూఆర్ కోడ్ ఉన్న విజిటర్ పాస్‌ను రూపొందించారు. దీనిలో అర్జీదారు పూర్తి వివరాలు నమోదవుతాయి. అర్జీదారు వచ్చిన సమయం నుంచి.. వెళ్లే వరకు అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఎంతమంది అర్జీదారులు సచివాలయానికి వస్తున్నారు?, వాళ్లు ఏయే మంత్రుల పేషీకి వెళ్తున్నారు?, ఏ నంబర్ గదికి వెళ్తున్నారు? తదితర వివరాలను తీసుకుంటారు.
ఈ–పాస్‌లతో మంత్రులు, పేషీకి ఇచ్చిన అర్జీల్లో ఎంత మొత్తం పరిష్కారం అవుతున్నాయో కూడా చూస్తారని సమాచారం. మరోవైపు అర్జీదారు పాస్ తీసుకున్న చోటికే వెళ్లారా? లేక ఇతర అధికారుల దగ్గరకు వెళ్లారా? అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంటుందని క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం చాంబర్ ముందు కొంతమంది ఆందోళన చేసిన నేపథ్యంలో.. ఈ విధానానికి రూపకల్పన చేసినట్లు సమాచారం.