ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్‌ పాటిస్తే జాబ్‌ మీదే! | Telangana Govt Job Notifications Preparation Tips From Experts | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఈ టిప్స్‌ పాటిస్తే జాబ్‌ మీదే!

Mar 21 2022 9:54 AM | Updated on Mar 21 2022 5:43 PM

Telangana Govt Job Notifications Preparation Tips From Experts - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్టడీ మెటీరియల్‌ కోసం పుస్తకాల షాపులను, నిపుణులను సంప్రదిస్తున్నారు. మరోవైపు స్టడీ హాళ్లు, లైబ్రరీలు సందడిగా మారాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, దిల్‌సుక్‌నగర్, తదితర ప్రాంతాలోని కోచింగ్‌ సెంటర్లకు అభ్యర్థులు వెల్లువెత్తుతున్నారు.

ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు  సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి..  
పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారు మొదట స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలి. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నాం అనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఆ ఉద్యోగం తనకు ఎందుకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకోవాలి. అనంతరం పరీక్షలకు అవసరమైన మెటీరియల్, కోచింగ్‌ వంటివి  సమకూర్చుకొని మానసిక, శారీరక సంసిద్ధతతో ప్రిపరేషన్‌ ఆరంభించాలి. 

సంశయాత్మక వైఖరి కూడదు.. 
ప్రిపరేషన్‌ ప్రారంభించిన తర్వాత కూడా చాలా మంది  ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. లక్షలాది మందితో పోటీపడడం తనకు సాధ్యం కాదేమోననే ఆందోళనకు గురవుతారు. తమ చుట్టూ ఉన్నవారు బాగా చదువుతున్నారని, తాము మాత్రమే  వెనుకబడిపోతున్నామనే భావన కొంతమందిని వెంటాడుతుంది. ఇలాంటి సంశయాత్మక వైఖరి వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన  భావనతో అధ్యయనం మొదలుపెట్టాలి. రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలి.  

కఠినమైన అంశాలపై దృష్టి సారించాలి.. 
సాధారణంగా చాలా మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో తేలిగ్గా ఉండే అంశాలతో ప్రారంభించి ఆ తర్వాత  కఠినమైన అంశాల్లోకి వెళ్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికి వారు తమకు  కఠినమైనవిగా అనిపించిన పాఠ్యాంశాలను మొదట ఓ పట్టుపడితే  ఆ తర్వాత తేలిగ్గా ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.  

మన స్థాయిని అంచనా వేసుకోవాలి.. 
ఇతరులతో పోల్చుకొని తాము వెనుకబడిపోతున్నామని ఆందోళనకు గురికావొద్దు. తోటివారితో పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ తమ ప్రిపరేషన్‌ను నిరుత్సాహానికి గురి చేసేలా ఉండకూడదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆ రోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవడం మంచిది. 
– డాక్టర్‌ గీత చల్లా, మానసిక నిపుణులు



ప్రశాంతంగా ఉండాలి..   
ప్రిపరేషన్‌ సమయంలో ఆందోళనకు గురైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. దీంతో  శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. అలసట లేకుండా  అధ్యయనం చేయగలుగుతారు. సరైన  నిద్ర, చక్కటి పోషకాహారం కూడా ఈ సమయంలో ఎంతో అవసరం.
– డాక్టర్‌ సంహిత, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement