సాధారణ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana Govt gives green signal for general transfers of employees | Sakshi
Sakshi News home page

సాధారణ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Apr 22 2026 5:39 AM | Updated on Apr 22 2026 5:39 AM

Telangana Govt gives green signal for general transfers of employees

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం 

మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలకు షెడ్యూల్‌

మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారంతా బదిలీ కావాల్సిందే 

భార్యాభర్తల విషయంలో సడలింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

సాక్షి, హైదరాబాద్‌:  ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు సాధారణ బదిలీల షెడ్యూల్, ఈ బదిలీల్లో పాటించాల్సిన విధివిధానాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం జారీ చేసిన జీవో ఎంఎస్‌. నం: 38 ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వరకు బదిలీలు నిర్వహించాలి. మూడేళ్ల పాటు ఒకేచోట (స్టేషన్‌) పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలి. భార్యాభర్తల విషయంలో ఈ నిబంధనకు సడలింపు ఉంటుంది. డిసెంబర్‌ 31, 2025 నాటికి ఒకే స్టేషన్‌లో నాలు గేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే 2027, మే 31 నాటికి ఉద్యోగ విరమణ చేసే వారిని నాలుగేళ్ల సర్వీసు పూర్తయినా బదిలీలు చేయవద్దని, సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఒకే కేడర్‌లో 40 శాతానికి మించకుండా బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

బదిలీలకు మార్గదర్శకాలు.. 
తమ తమ శాఖల పరిధిలోని ప్రతి ఉద్యోగి ఎక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడనే వివరాలను కేటగిరీ, కేడర్‌ వారీగా ఆయా శాఖలు ప్రకటించాలి.  
⇒ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవడానికంటే ముందే ఆయా శాఖల్లోని స్పష్టమైన ఖాళీలను వెల్లడించాలి.  
⇒ ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల జాబితాను కూడా ముందే ప్రకటించాలి. ఒక్కో ఉద్యోగి నుంచి ఐదు ఆప్షన్లు తీసుకోవచ్చు. ఆప్షన్ల ప్రొఫార్మాను శాఖల వారీ అవసరాలను బట్టి మార్పులు చేసుకోవచ్చు.  
⇒ బదిలీల ప్రక్రియ అనంతరం కష్టతరమైన ప్రాంతాల్లోనూ కనీస సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కష్టతరమైన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఆప్షన్‌ ఇవ్వకపోతే లాటరీ పద్ధతి ద్వారా ఆ ప్రాంతాలకు సిబ్బందిని కేటాయించాలి.  
⇒ అన్ని బదిలీలు కౌన్సెలింగ్‌ ద్వారా పారదర్శక విధానంలో జరగాలి. ఆన్‌లైన్‌లో కూడా కౌన్సెలింగ్‌ చేయొచ్చు. అన్ని దశల వివరాలను ఆన్‌లైన్‌తో పాటు ఆఫీసు నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచాలి.  

ముఖ్య నిబంధనలివి.. 
⇒ రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలి.  
⇒ రెండో స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల్లో పనిచేస్తున్న గెజిటెడ్‌ అధికారుల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న సొంత జిల్లా నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.  
⇒ జనగణన సంబంధిత ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులకు నిబంధనలు వర్తించవు.  
⇒ జూన్, 1, 2026 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.  
⇒ పోలీసుల బదిలీల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు తయారు చేసుకోవాలి.  
⇒ ఆదాయార్జిత శాఖలు (పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంపులు–రిజి్రస్టేషన్లు, రవాణా, అటవీ శాఖలు) ఇప్పటికే తమ తమ శాఖల పరిధిలో అమలవుతోన్న నిబంధనల ఆధారంగా బదిలీలు చేపట్టాలి. అవసరమైన చోట మార్పులు చేసుకోవచ్చు.  
⇒ టీచర్లు, లెక్చరర్ల బదిలీల కోసం విద్యా శాఖ ప్రత్యేక సవివర మార్గదర్శకాలను రూపొందించుకోవాలి.  
⇒ ఉద్యోగ సంఘాల నేతల బదిలీల విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనను చిత్తశుద్ధితో అమలు చేయాలి.  
⇒ ఫోకల్‌ నుంచి నాన్‌ ఫోకల్‌కు, నాన్‌ఫోకల్‌ నుంచి ఫోకల్‌ స్టేషన్లకు బదిలీలు జరగాలి. ఫోకల్, నాన్‌ ఫోకల్‌ స్టేషన్లను సంబంధిత శాఖ గుర్తిస్తుంది.  
⇒ ఒకే స్టేషన్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఎంచుకున్న పక్షంలో శాఖా పరమైన, న్యాయపరమైన అభియోగాలు లేని భార్యాభర్తలు (ఇద్దరిలో ఒకరికి మాత్రమే వర్తింపు), వచ్చే ఏడాది మే 31నాటికి రిటైర్‌ అయ్యే ఉద్యోగులు, 70 శాతం అంగవైకల్యం ఉన్నవారు, మానసిక వైక్యలమున్న పిల్లలున్నవారు, వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్స్‌ ఉన్నవారు, కష్టమైతరమైన ప్రాంతాల్లో ఎక్కువ సర్వీసు చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలి.  


(ఈ ఉత్తర్వులు జారీ అయిన మూడోరోజు నుంచి సదరు ఉద్యోగి ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్‌ అయినట్టుగా పరిగణిస్తారు.) 

రెండేళ్లు పూర్తయిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి: జేఏసీ 
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల కొంత ఊరట లభించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ వొడ్నాల రాజశేఖర్‌ తెలిపారు. అయితే ప్రస్తుత మార్గదర్శకాలలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకే బదిలీలకు అవకాశం కల్పించారని, దీనిని రెండేళ్లకు కుదించాలని కోరారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగుల బదిలీలకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను కనీసం రెండు నెలల పాటు పొడిగించాలని సూచించారు. అర్హత కలిగిన అందరికీ బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement