హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె సైరన్‌కు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ చర్చలు కొనసాగిస్తోంది. సమ్మెను విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీని అధికారుల కమిటి కోరింది. తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సదరు కమిటీ స్పష్టం చేసింది.
కాగా, టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జీవో నంబర్ 66 విడుదల చేసింది.
కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడు), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఆర్థిక శాఖ - సభ్యుడు), వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్(టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్)లు ఉన్నారు. కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి. ఈ క్రమంలోనే నాలుగు వారాల సమయం ఇవ్వాలని అధికారుల కమిటీ.. ఆర్టీసీ జేఏసీని కోరుతోంది.


