సాక్షి,వరంగల్: నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల్ శంకర్‌గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా,మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.
చర్చల్లో ఆర్టీసీ జేఏసీ మూడు డిమాండ్లు ఇవే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను పునరుద్ధరించాలి. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలి.2025 వేతన సవరణ అమలు చేయాలి’అని డిమాండ్లు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్‌గౌడ్ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు.
ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత
ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండగా.. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బండిసంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్ పోలీసులే అంత్యక్రియలు చేయండంటూ ఫైర్ అయ్యారు. కుమార్తె ఇంటికి శంకర్ గౌడ్ మృతదేహం తరలించారు.


