మంత్రి హరీశ్‌కు కరోనా పాజిటివ్‌

Telangana Finance Minister Harish Rao Tests COVID-19 Positive - Sakshi

హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు వెల్లడి

తనను కలుసుకోవడానికి రావొద్దని అభిమానులు, కార్యకర్తలకు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం స్వయంగా వెల్లడించారు. హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. ‘కరోనా వైరస్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. గత కొద్ది రోజులుగా నాతో కలసి తిరిగిన వారు మీకు మీరుగా ఐసోలేషన్‌కు వెళ్లడంతోపాటు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని మంత్రి హరీశ్‌ ట్విట్టర్‌ 
వేదికగా విజ్ఞప్తి చేశారు. తనను కలసుకోవడానికి రావద్దని అభిమానులు, కార్యకర్తలను కోరారు. ‘నాకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైద్యం. దయచేసి నాకు ఫోన్‌ చేయడానికి కానీ, నన్ను కలసుకోవడానికి కానీ ప్రయత్నించకండి. నా హెల్త్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా మీతో పంచుకుంటాను’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

త్వరగా కోలుకో బావా: కేటీఆర్‌ ట్వీట్‌ 
కరోనా బారిన పడిన మంత్రి హరీశ్‌రావు త్వరగా కోలుకోవాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. ‘త్వరగా కోలుకో బావా.. ఇతరుల కంటే నీవు త్వరగా కోలుకుంటావని నేను గట్టిగా నమ్ముతున్నా’అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. (కరోనా తీవ్రత పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తం)

అసెంబ్లీలో కరోనా పరీక్షలు
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేయడంతో శనివారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ లాబీతో పాటు శాసన మండలిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, రేగా కాంతారావు, సీఎల్పీనేత భట్టి విక్రమార్క తదితరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కరోనా పరీక్షలు నిర్వహించేలా శాసనసభ, మండలిలో ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉంటే సభ్యులు సభకు హాజరు కావద్దంటూ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top