వైభవంగా రామలింగేశ్వరాలయ ఉద్ఘాటన

Telangana CM KCR Reopens Sri Parvathavardhini Sametha Ramalingeshwara Temple At Yadadri - Sakshi

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి అనుబంధ ఆలయంలో కార్యక్రమాలు

మహాకుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ దంపతులు

స్ఫటిక లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

రా.. ఆంజనేయులు.. ‘గుట్ట’కు పోదాం!
తుర్కపల్లి: సీఎం కేసీఆర్‌ సోమవారం యాదగిరిగుట్టకు వస్తూ మధ్యలో భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆగారు. గ్రామస్తులతో మాట్లాడారు. సర్పంచ్‌ పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్‌లో ఎక్కించుకుని యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిస్థితుల గురించి ఆంజనేయులును ఆడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో రామాలయం, పాఠశాల తొలగింపుపై గ్రామస్తుల అభిప్రాయాలను ఆంజనేయులు సీఎంకు వివరించారు. కాగా సీఎం ప్రయాణం సందర్భంగా వాసాలమర్రిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపై శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన గత నెల 28న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న రామలింగేశ్వరుడి ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మించారు.

ఇటీవలే ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో మహాకుంభాభిషేకం, ఉద్ఘాటన, స్పటిక లింగ ప్రతిష్టాపన చేపట్టారు. సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లింగానికి అభిషేకం చేశారు. అనంతరం పూజారులు అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్‌ దంపతులకు యాగ మండపంలో మాధవా నంద సరస్వతి స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తీర్చి దిద్దిన స్తపతి బాలసుబ్రహ్మణ్యంను శాలువాతో సన్మానించి, బంగారు కంకణాన్ని చేతికి తొడిగారు.

తొలుత నరసింహుడిని దర్శించుకుని..
సీఎం కేసీఆర్‌ సతీమణి శోభతో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం 11.50 గంటలకు యాదగిరిగుట్టకు వచ్చారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని.. మూడో ఘాట్‌రోడ్డు మీదుగా ప్రధానాలయానికి చేరుకున్నారు. వేద పండితులు తూర్పు రాజగోపురం వద్ద సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు.

తర్వాత సీఎం దంపతులు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని దర్శించు కుని.. శివాలయానికి వెళ్లారు. 12.48 గంటలకు మహాశివుడిని దర్శించుకొని, శ్రీమాధవనంద సరస్వతి స్వామితో కలిసి అభిషేకం, పూజల్లో పాల్గొన్నారు. మహాపూర్ణాహుతి అనంతరం 1.37 గంటల సమయంలో ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లారు. అక్కడ భోజనం చేసి, అధికారులతో సమీక్షించారు. 3.10 గంటల సమయంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు.

ప్రత్యేక ఏర్పాట్లు.. బందోబస్తు..
సీఎం రాక సందర్భంగా యాదగిరిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం నుంచి శివాల యం వరకు ఎర్ర తివాచీలు పరిచారు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో సీఎం దంపతులకు ప్రత్యే కంగా గొడుగులను ఏర్పాటు చేశారు. ఇక గుట్ట పైన, కింద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top