పర్యాటకం.. పెట్టుబడులు.. ఉపాధి | Telangana CM to inaugurate tourism conclave | Sakshi
Sakshi News home page

పర్యాటకం.. పెట్టుబడులు.. ఉపాధి

Sep 27 2025 1:21 AM | Updated on Sep 27 2025 1:21 AM

Telangana CM to inaugurate tourism conclave

కొత్త పర్యాటక విధానానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రకటించనున్న సీఎం  

రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధికి సంబంధించి నేడు ఒప్పందాలు 

హైదరాబాద్‌–సోమశిల–శ్రీశైలం మధ్య హెలీకాప్టర్‌ టూరిజం 

నాగార్జునసాగర్‌–శ్రీశైలం, శ్రీశైలం–భద్రాచలం సీప్లేన్‌ విహారం 

హెల్త్‌ టూరిజానికి ఊతం.. మన సంప్రదాయ వంటకాలకు ప్రాచుర్యం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. పర్యాటక రంగాన్ని కేవలం ప్రజలకు ఆహ్లాదం కల్పించడానికి మాత్రమే పరిమితం చేయకుండా పెట్టుబడులు ఆకర్షించడం, పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో పాటు పూర్తిస్థాయి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వనించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పలు ఒప్పందాలు చేసుకోనుంది. శనివారం శిల్పకళావేదికలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే సదస్సులో పలు పథకాలు, కార్యక్రమాలను సీఎం ప్రకటించనున్నారు.

పకడ్బందీగా హెలీ టూరిజం
హెలీకాప్టర్‌ టూరిజాన్ని అందుబాటులోకి తేవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెలీ టూరిజం లేదు. కేవలం మేడారం జాతర సందర్భంగా ఒకటి రెండుసార్లు ఏర్పాటు చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈసారి దీ న్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. పెరిగిన జీవన ప్రమాణాలు, సమయాన్ని సది్వనియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు సరికొత్త అనుభూతి పొందేందుకు హెలీకాప్టర్‌ పర్యాటకంవైపు ప్రభు త్వం అడుగు లు వేస్తోంది. తొలుత హైదరాబాద్‌ నుంచి సోమశిల అక్కడ నుంచి శ్రీశైలం వర కు హెలీకాప్టర్‌ సేవలు ప్రారంభించనుంది.

పర్యాటకుల ఆదరణ ఆధారంగా దానిని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. మరోవైపు సీ ప్లేన్‌ అనుమతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీటి మీద నుంచి టేకాఫ్‌ తీసుకోవడంతో పాటు నీళ్లలోనే ల్యాండయ్యే సీ ప్లేన్‌లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీప్లేన్‌ విహారం ఉండనుంది. ప్రస్తుతం దీని సాధ్యాసాధ్యాలపై (ఫీజబిలిటీ) ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

‘సినిమాలకు’ సింగిల్‌ విండో అనుమతులు 
ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్‌కు పేరుందని ప్రభుత్వం పేర్కొంది. దాన్ని మరింత అభివృద్ధి పరచడం ద్వారా చిత్ర పరిశ్రమకు మరింత స్నేహపూరిత వాతావరణం కల్పించాలని, అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా శనివారం ఫిల్మ్‌ ఇన్‌ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్‌ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ ప్రాంతాల్లో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభించనుంది. ఈ సులువైన విధానాలతో జాతీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాణాలకు హైదరాబాద్‌ నిలయంగా మారుతుందని భావిస్తున్నారు.

హోటళ్లు.. హాస్పిటాలిటీ ప్రాజెక్టులు 
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటళ్లు, వెల్‌నెస్‌ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తోంది. అనంతగిరి కొండల్లో జెసోమ్‌ అండ్‌ జెన్‌ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్‌నెస్‌ సెంటర్, ద్రాక్ష పంట ఆధారిత వైన్‌ తయారీ యూనిట్, అటవీ ప్రాంతంలో తాజ్‌ సఫారీ ఏర్పాటు కానున్నాయి. మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ ఫ్రంట్‌ రిసార్టులు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రాష్ట్రంలోని టైర్‌ 2 నగరాల్లో జింజర్‌ హోటళ్లు, నాగార్జునసాగర్‌లో వెల్‌నెస్‌ రిట్రీట్‌కు ఒప్పందాలు కుదరనున్నాయి.

తైవాన్‌కు చెందిన ఫో గౌంగ్‌ షాన్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ సెంటర్‌ బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో శనివారం ఈ సంస్థలు ఆయా పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫలితంగా రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు ప్రత్యక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.

విదేశీ రోగుల కోసం ఎంవీటీ పోర్టల్‌ 
వివిధ దేశాల నుంచి చౌక వైద్యం కోసం హైదరాబాద్‌కు రోగులు వస్తున్న సంగతి విదితమే. కాగా మరింత పెద్ద సంఖ్యలో వారిని ఆకర్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ మెడికల్‌ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌లో హైదరాబాద్‌లో ఏ ఏ ఆసుపత్రులున్నాయి..?ప్రముఖ వైద్యులెవరు..? ఏరకమైన సేవలు అందిస్తారు.. ఏ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది.. వీసాల జారీ.. పొడిగింపు తదితర వివరాలన్ని అందులో పొందుపర్చనున్నారు. విమానాశ్రయం నుంచి ఆ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలో సూచనలు పొందుపరచడంతో పాటు, ఆయా దేశాల వారి సౌలభ్యం కోసం వారి భాషను అనువదించే ట్రాన్స్‌లేటర్ల వివరాలు కూడా పోర్టల్‌లో ఉంటాయి.  

వంటలు.. రుచులకు ప్రాచుర్యం 
తెలంగాణలో వంటల వైవిధ్యం ఎంతగానో ఉంది. హైదరాబాద్‌ బిర్యాని, సర్వపిండి, సకినాలు, బోటీ కూర..ఇలా ప్రత్యేక వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏ ప్రాంతంలో ఏ వంట.. ఆ వంట ప్రత్యేకతలతో కూడిన వివరాలతో మ్యాప్‌నకు రూపకల్పన చేసింది. ఈ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాలతో మన వంటలకు అంతర్జాతీయంగా గిరాకీ పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పర్యాటకులకు పటిష్ట భద్రత 
రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కేవలం 15 మంది టూరిస్ట్‌ పోలీసులే ఉండగా ఆ సంఖ్యను 90కు పెంచాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు ఒంటరిగానే పర్యాటక ప్రదేశాలకు వస్తున్న నేపథ్యంలో వారికి భద్రత, భరోసా కల్పించేలా ఈ టూరిస్ట్‌ పోలీసులు సేవలు అందించనున్నారు.

సర్కారు భాగస్వామ్యంతో ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు 
రాష్ట్రంలో భారీ కార్యకమాల నిర్వహణకు వీలుగా ‘బుక్‌ మై షో’తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంతో భారీ సినిమా ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే వీలుంది. మరోవైపు పర్యాటక రంగంలోని హోటళ్లు, ఇతర సంస్థలు అందించే 
సేవల ఆధారంగా వాటికి అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నేడు ‘ముచుకుందా’ ప్రారంభం
జల విహారాలను ప్రోత్సహించడంలో భాగంగా శనివారం హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్‌ డెక్కర్‌ బోట్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. హైదరాబాద్‌కు ఒకనాడు జీవనాడిగా ఉన్న మూసీ అసలు పేరైన ముచుకుందా నది పేరును ఈ బోట్‌కు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement