బార్‌.. పీటముడి | Telangana Bar owners Demands Llicense Fees Be Waived For Lockdown Period | Sakshi
Sakshi News home page

బార్‌.. పీటముడి

Sep 22 2020 3:26 AM | Updated on Sep 22 2020 6:46 AM

Telangana Bar owners Demands Llicense Fees Be Waived For Lockdown Period - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వ్యవహారం పీటముడి పడినట్టు కనిపిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మూసి వేసిన బార్లను 6 నెలలవు తున్నా తెరిచేందుకు అనుమతించకపోవడంతో లైసెన్స్‌ ఫీజులు కట్టేందుకు బార్ల యజమానులు విముఖత చూపుతున్నారు. లాక్‌డౌన్‌ పేరుతో మూసివేసిన కాలానికి తమకు లైసెన్సు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తు న్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే... లైసెన్స్‌ ఫీజు కట్టాల్సిన గడువు సమీపించడంతో అసలు సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని వెయ్యి బార్ల ప్రస్తుత లైసెన్స్‌ గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నా... 15 రోజుల ముందుగానే ఫీజులు చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన అన్‌లాక్‌–4 మార్గదర్శకాల్లో బార్లను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సెప్టెంబర్‌ మొదటి లేదా రెండో వారంలోనే బార్లు తెరుస్తారని చర్చ జరిగింది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు బార్లు ఎప్పుడు తెరుస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న యజమానులు లైసెన్స్‌ ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌ కాలానికి లైసెన్స్‌ ఫీజు మినహాయించాలనే బార్‌ యాజమాన్యాల డిమాండ్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అసలు లైసెన్సు ఫీజులు కట్టాలా వద్దా అనే గందరగోళంలో పడ్డారు రాష్ట్రంలోని బార్ల యజమానులు. 

సీఎందే తుది నిర్ణయం
నిబంధనల ప్రకారం చూసుకుంటే... లైసెన్స్‌ ఫీజు మినహాయింపు సాధ్యం కాదని ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు నిర్దేశిత గడువు ముగిసేలోపు లైసెన్సు ఫీజులు చెల్లించని పక్షంలో... ఆయా లైసెన్సులు రద్దు చేయాలా లేదా కొనసాగించాలా?  అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు చెపుతున్నారు. ఫీజు కట్టకపోతే ప్రస్తుతమున్న లైసెన్సు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బార్‌ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్న తమను కరోనా మరింత నష్టాల్లోకి నెట్టిందని, ఈ పరిస్థితుల్లో లక్షల రూపాయల లైసెన్సు ఫీజులు తాము చెల్లించలేమని అంటున్నారు. యాజమాన్యాల అసోసియేషన్‌ కూడా ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. లైసెన్స్‌ ఫీజు మినహాయింపులో కానీ, బార్లు తెరిచే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ బార్ల యజమానుల్లోనూ, ఎక్సైజ్‌ వర్గాల్లోనూ కనిపిస్తోంది. మరి, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement