మూడు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశం
7 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కారు
జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా?
అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాల కోసం చర్చ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 లేదా 28వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాలను మూడు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలి సింది. ఇందుకోసం సీఎం అధ్యక్షతన ఈనెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతోపాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టతనివ్వను న్నట్లు సమాచారం.
అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతోపాటు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై మరోసారి అసెంబ్లీలో చర్చించి.. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చేవరకు వేచి ఉండటమా..? లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జెడ్పీ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమా అనే దానిపై చర్చించనున్నారు.
కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత తెచ్చిన మొత్తం ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో అసెంబ్లీలో ఆయా బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో రెండు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణలు, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం.. వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం జరిగే అనధికార మంత్రివర్గ సమావేశంలో వీటికి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.


