ఎస్‌ఐ వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం 

Suicide Attempt Due To SI Harassment : Victim - Sakshi

నర్సాపూర్‌: ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి ఉదంతమిది. శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన కంచన్‌పల్లి శేఖర్‌ శివ్వంపేట ఎస్‌ఐ రమేష్‌ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం ప్రకారం.. స్వగ్రామంలో తనకు చెందిన ఎకరం 5గుంటల భూమిని అమ్మకానికి పెట్టగా ఏజంట్లు సత్యనారాయణ, శేఖర్‌గౌడ్, పాండరిగౌడ్‌ మధ్యవర్తిత్వం వహించగా పిల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీధర్‌గౌడ్‌కు ఎకరానికి రూ.33లక్షల ధరకు సుమారు మూడు నెలల క్రితం విక్రయించానని, అడ్వాన్సు కింద తనకు 8లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు.

60రోజుల అగ్రిమెంటుతో భూమి అమ్మగా సమయం దాటిన తర్వాత  ఏజెంట్లు వచ్చి భూమి రిజిస్ట్రేషన్‌ చేయమనడంతో దానికి తాను నిరాకరించినట్లు తెలిపారు. ఏజెంట్‌ శేఖర్‌గౌడ్‌ తల్లి పోచమ్మ తమ ఇంటికి వచ్చి తన భార్య లలితను దుర్భషలాడుతూ.. దాడిచేయడంతో ఈనెల 5న శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌కు వెల్లి తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తాను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా ఎస్‌ఐ రమేష్‌ దుర్భాషలాడటంతో పాటు రూ. 40వేలు ఇస్తేనే నీకు న్యాయం చేస్తానని లేనిపక్షంలో వ్యతిరేక వర్గానికి అనుకూలంగా కేసు చేస్తానని హెచ్చరించారని చెప్పారు.

రాత్రి ఏడున్నరకు తనను పోలీస్‌ స్టేషన్‌ నుంచి వదిలిపెట్టారని, తన వద్ద డబ్బులు లేవని, తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడానికే భూమి అమ్మినట్లు చెప్పారు. ఎస్‌ఐ రమేష్‌ డబ్బులు అడగడంతో పాటు దుర్భాషలాడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో పోలీస్‌ స్టేషన్‌ నుంచి గ్రామ శివారులోకి రాగానే పురుగుల మందు తాగినట్లు ఆయన చెప్పారు. తాను ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు తాగుతున్నట్లు తన మొబైల్‌లో రికార్డు చేసినట్లు తెలిపారు. అది చూసిన గ్రామస్తులు నర్సాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్సచేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.  

ఎస్‌ఐ రమేష్‌ వివరణ.. 
తమకు కంచనపల్లిశేకర్‌ దంపతులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని శివ్వంపేట ఎస్‌ఐ రమేష్‌ చెప్పారు. గ్రామంలో జరిగిన  గొడవ కావడంతో అక్కడే కూర్చుని మాట్లాడుకోవాలని ఇరు వర్గాలకు సూచించానని చెప్పారు. చిన్న గొడవ కావడంతో ఇరు వర్గాలు శాంతపజేయటం కోసం పీఎస్‌కు పిలిపించానని చెప్పారు. తాను శేఖర్‌ను తిట్టలేదని, డబ్బులు అడగలేదని ఆయన వివరించారు. తాను డబ్బులు అడగినట్లు, దుర్భషలాడుతూ తిట్టినట్లు శేఖర్‌ నాఎదుట చెబితే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి వెల్లిపోతానని ఎస్‌ఐ స్పష్టం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top