2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు.. నిర్లక్షమా? సాంకేతిక లోపమా?

Students Alleges Fraud In JNTUH Engineering Last Semester Results - Sakshi

జేఎన్‌టీయూహెచ్‌లో మార్కుల కలకలం.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల ధర్నా 

వర్సిటీ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు.. డేటా పరిశీలిస్తామన్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్‌ మార్కులను ఇటీవల ప్రకటించారు.

ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసి, ఐసెట్‌ ద్వారా నేరుగా ఇంజనీరింగ్‌ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్‌ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్‌టర్నల్స్‌లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.

అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.  
(చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు )

ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్‌వేర్‌ 
కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్‌టీయూహెచ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుతోంది. ఆప్‌లోడ్‌ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్‌వేర్‌లో లేదని, తప్పులు ఆటోమేటిక్‌గా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు.

మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్‌ చేయించడం, వేగంగా మార్కులు అప్‌లోడ్‌ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు.  
(చదవండి: మల్లాపూర్‌: మసాజ్‌ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్‌)

సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం 
ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.  
– మంజూర్‌ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూహెచ్‌ 

అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. 
వాల్యుయేషన్‌ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్‌కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం.
– అయినేని సంతోష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం 

అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో 
ఇంటర్నల్స్‌లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్‌ పేపర్‌లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు.
– సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కాలేజీ  

అధికారులే బాధ్యత వహించాలి 
వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
– నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top