దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఉదయం 5–6 గంటల మధ్య ప్రధాన రైళ్ల రాకపోకలు
ఆ సమయంలో స్టేషన్లకు వచ్చిపోయే వారి సంఖ్య 50 వేలు
వారిని గమ్యం చేర్చే స్థాయిలో అందుబాటులో లేని సిటీ బస్సులు
మెట్రోను గంట ముందు నడపటమే పరిష్కారమంటూ తాజాగా ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య హైదరాబాద్‌కు ప్రధాన రైళ్లు చేరుకుంటున్నాయి. అదే సమయంలో వందేభారత్ లాంటి మరికొన్ని ముఖ్యమైన రైళ్లు నగరం నుంచి బయలుదేరుతున్నాయి. రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేవారు..రైళ్లు ఎక్కేందుకు స్టేషన్లకు వచ్చేవారు కలిపి ఆ గంటలోనే దాదాపు 50 వేల మంది ఉంటున్నారు. వీరిని గమ్యం చేర్చటం ఆర్టీసీ బస్సుల వల్ల కావటం లేదు..ఆ సమయంలో బస్సుల సంఖ్య నామమాత్రంగా ఉండటమే దీనికి కారణం. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే మెట్రో రైళ్లను నడిపితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది.
ఇది తాజాగా దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన. రెండు రోజుల క్రితం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుల ఆధ్వర్యంలో జరిగిన రైల్వే–రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఇది. ఇప్పుడు దీనిని సాకారం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
3 కారిడార్లు..56 మెట్రో రైళ్లు
ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో కలిపి 56 మెట్రో రైళ్లు పరుగుపెడుతున్నాయి. మెట్రో రైళ్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతున్నాయి. రాత్రి 11 గంటలకు సర్వీసులు ముగిసిన తర్వాత మెట్రో రైళ్లకు మెయింటెనెన్స్ పనులు నిర్వహించి తిరిగి ఉదయం ఆరు గంటలకు ట్రిప్పులు ప్రారంభిస్తున్నారు. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, బేగంõ³ట, లింగంపల్లి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు ఇవి అనుకూలంగా ఉన్నాయి.
ఉప్పల్, తార్నాక లాంటి ప్రాంతాలలో దిగి అక్కడి నుంచి కనెక్టెడ్ బస్సుల ద్వారా చర్లపల్లిలోని కొత్త టెర్మినల్‌కు కూడా చేరుకునేందుకు వెసులుబాటు ఉంది. కానీ, ప్రధాన రైళ్లు నగరానికి చేరుకోవటం, కీలక రైళ్లు నగరం నుంచి బయలు దేరటం... ఈ రెండు ప్రక్రియలు ముగిసిన తర్వాత మెట్రో రైళ్లు ట్రిప్పులు ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఉదయం ఆరు గంటలకు బదులు ఐదు గంటలకే ప్రారంభించాలంటే, వాటి మెయింటెనెన్స్ పనులు ఓ గంట ముందే పూర్తి చేయాలి. కానీ ఆలోపు మెయింటెనెన్స్ పనులు పూర్తి చేయటం అంత సులువు కాదని అధికారులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీ బస్సులు అంతంతమాత్రమే....
మెట్రో రైళ్లు లేని సమయంలో వేలాదిమంది రైలు ప్రయాణికులను గమ్యం చేర్చే స్థాయిలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఇప్పటికిప్పుడు చాలినన్ని బస్సులు సమకూర్చటం కూడా సాధ్యం కాదు. రైల్వే స్టేషన్లకు చేరుకోవాలన్నా, రైల్వే స్టేషన్ల నుంచి ఇళ్లకు వెళ్లాలన్నా... ఉదయం ఐదు నుంచి ఆరు మధ్య ప్రజా రవాణా సరిగా లేదని స్వయంగా ఈ ప్రతిపాదనతో రైల్వే శాఖ తేల్చి చెప్పింది. దీంతో మెట్రో రైళ్ల సమయాన్ని ముందుకు జరిపేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
మెట్రో రైళ్ల నిర్వహణ పనులను గంట ముందు పూర్తి చేసి పట్టాలెక్కించాలంటే చేయాల్సిన కసరత్తు ఏంటో తేల్చాలంటూ ప్రభుత్వం ఇంజనీర్లను పురమాయించింది. వారం రోజుల్లో ఆ మేరకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. గంట ముందుకు జరపలేని పక్షంలో, కనీసం అరగంట ముందు ప్రారంభించేందుకు అవకాశం ఉందేమో పరిశీలించనున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు.
కనెక్టెడ్ బస్సులు ఏవి?
నగరానికి దూరంగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ నుంచి ఇప్పుడు చాలా ముఖ్యమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడకు వెళ్లేందుకు వీలుగా చాలినన్ని బస్సుల్లేవు. మెట్రో రైలులో వచ్చి తార్నాక, ఉప్పల్‌లో దిగే ప్రయాణికులను చర్లపల్లికి చేర్చేలా బస్సు అనుసంధానం అవసరం. ఈ రెండు ప్రాంతాలే కాకుండా ఇతర, మెట్రో స్టేషన్ల నుంచి కూడా ఈ కనెక్టివిటీ అవసరం. కానీ, అందుకు తగినన్ని బస్సులు ఆర్టీసీ వద్ద లేకపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు.


