స్టాఫ్‌నర్స్‌ల ఆందోళన.. అసలేం జరిగింది? | Staff Nurses Protest Objections Awarding Weightage Marks TSPSC Exam | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల వెయిటేజీలో అవకతవకలు

Feb 17 2021 8:05 AM | Updated on Feb 17 2021 12:40 PM

Staff Nurses Protest Objections Awarding Weightage Marks TSPSC Exam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

2017 నవంబర్‌లో 3,311 స్టాఫ్‌ నర్సు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ, జనరల్‌ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ నర్సు పోస్టులకు వెయిటేజీ మార్కులు కలపడంలో అర్హులైన తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మొదటి జాబితాలో అసలైన వారికి వెయిటేజీ మార్కులిచ్చి, సవరణ జాబితాలో వాటిని తీసేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్‌ నర్సు పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తుది సవరణ జాబితాను సోమవారం ప్రకటించింది. అందులో అర్హులైన అభ్యర్థులు అనేక మందికి వెయిటేజీ కలపలేదు. దీంతో అన్యాయం జరిగిందంటూ ఆ అభ్యర్థులు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. 

అసలేం జరిగింది?
2017 నవంబర్‌లో 3,311 స్టాఫ్‌ నర్సు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ, జనరల్‌ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్నారు. కొందరు ప్రైవేట్‌లోనూ పనిచేస్తున్నారు. 2018 మార్చిలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు పరీక్ష జరిగింది. 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించారు. అలాగే 30 మార్కులు వెయిటేజీగా నిర్ధారించారు. సర్వీసుకు గరిష్టంగా 20, అకడమిక్‌కు 10 వరకు వెయిటేజీ మార్కులుగా పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా వారి సర్వీసును బట్టి 20 మార్కులు కలపాలనేది ఉద్దేశం.. ఆ ప్రకారం 2020 నవంబర్‌ 7వ తేదీన మొదటి మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

అయితే కాంట్రాక్టు నర్సులకే కాకుండా, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసేవారు తప్పుడు కాంట్రాక్టు సర్టిఫికెట్‌ పెట్టినా వెయిటేజీ ఇచ్చారని కొందరు ఆరోపించారు. దీనిపై ఏర్పాటైన కమిటీ ఆ మొదటి మెరిట్‌ లిస్టును రద్దు చేసింది. తప్పులు సరిదిద్దాక సవరణ రెండో జాబితాను టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అయితే అనేక మంది అసలైన కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల వెయిటేజీని ఈ జాబితాలో తొలగించడంతో దుమారం రేగింది. మొదటి జాబితాలో ఉన్నప్పటికీ, సవరణ జాబితాలో చాలా మందికి వెయిటేజీ మార్కులను కలపలేదు.

ఉదాహరణకు: మొదటి జాబితాలో వంద ర్యాంకున్నవారు, వెయిటేజీ మార్కులు వేయకపోవడం వల్ల సవరణ జాబితాలో ఏకంగా 2 వేలకు ర్యాంకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. కొందరి వెయిటేజీ మార్కులను తక్కువగా వేశారు. పైగా దాని ప్రకారమే ఈ నెల 24 నుంచి సెలెక్షన్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే జాబితా తప్పులు తడకగా రూపొందించారంటూ టీఎస్‌పీఎస్సీ అధికారుల వద్ద ఫిర్యాదు చేయగా.. వైద్య, ఆరోగ్యశాఖ పంపిన వివరాల ఆధారంగానే వెయిటేజీ ఖరారు చేశామని వారు పేర్కొన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 వేల మంది కాంట్రాక్టు నర్సులు ఉంటారని అంచనా.

సర్వీస్‌ మార్కులు తొలగించటం అన్యాయం..
నాకు మొదటి జాబితాలో కాంట్రాక్టు సర్వీస్‌ వెయిటేజీ మార్కులు 16, అకడమిక్‌ వెయిటేజీ మార్కులు 10 కలిశాయి. దీంతో నా ర్యాంక్‌ 35గా ఉంది. ఇప్పుడు సవరణ జాబితాలో సర్వీస్‌ మార్కులు 16 తీసి.. కేవలం అకడమిక్‌ మార్కులు 10 మాత్రమే వేశారు. దీంతో నా ర్యాంకు మొదటి జాబితా ప్రకారం 35 ఉంటే, సవరణ జాబితాలో ఏకంగా 773కు పోయింది. అలాగే ఒక కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుకు మొదటి జాబితాలో 500 ర్యాంకు ఉండగా, సవరణ జాబితాలో అది దాదాపు 5 వేలకు చేరింది. మాకు అన్యాయం జరిగినందున న్యాయం చేయాలని కోరుతున్నాం.. 
– నవనీత, కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement