ప్రకృతితోనే మమేకం .. ఎలక్ట్రిక్‌ వస్తువులు లేవు.. 30 ఏళ్లలో చనిపోయింది ఏడుగురే..

Special Story On Rajamma Thanda In Kamareddy District - Sakshi

వీరి ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే.. 

వంటలన్నీ కట్టెల పొయ్యిపైనే.. 

తండాలో కనిపించని ఎలక్రి్టక్‌ వస్తువులు 

30 ఏళ్లలో చనిపోయింది ఏడుగురు మాత్రమే 

కరోనాను దరిచేరనివ్వని తండా

సాక్షి, రామారెడ్డి (ఎల్లారెడ్డి): పరిపూర్ణ ఆరోగ్యం, శారీరక, మానసిక ఆధ్యాత్మిక అనుసంధానమే ప్రకృతి జీవనం. ప్రకృతి జీవనం అంటే చెట్లు, పుట్టలు కొండలు, పక్షులతో సహజీవనంలో ఉండటమే. ప్రకృతిలో భాగమైన మనిషి పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తండా ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేసి.. ప్రకృతి–మనిషి సంబంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పును తప్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండాపై ప్రత్యేక కథనం. 

తండావాసులకు వరం
సహజసిద్ధ వాతావరణంలో జీవించడం వల్ల వారికి రోగ నిరోధిక శక్తి బాగా ఇనుమడిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇదే రాజమ్మ తండా వాసులకు వరంగా మారింది. పచ్చని ప్రకృతి మధ్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం. వీరి ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే ఉంది. ఈ తండాలో గత 30 ఏళ్లలో ఏడుగురు మృతిచెందగా, వారిలో మధ్య వయస్కులు ఇద్దరు మాత్రమే అనా రోగ్యంతో మరణించారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వంద ఏళ్లు పూర్తిచేసుకోగా, ముగ్గురు 90 ఏళ్లలో మరణించారు. ఇప్పటికీ 90 ఏళ్లపైబడి ఉన్న వారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. 

అల్లం–ఎల్లి కారంతో కలిపి.. 
వీరు వంటలు మొత్తం కట్టెల పొయ్యిపైనే చేస్తారు. వీరి ప్రధాన ఆహారం మక్క రొట్టెలు. అల్లం–ఎల్లి కారంతో వీటిని తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని తండా వాసులు చెబుతారు. ఇళ్ల పక్కనే ఉన్న తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను వాడతారు. ఒక్కో కుటుంబానికి సగటున నాలుగెకరాల పొలం ఉంటుంది.  

ఎల్రక్టానిక్‌ వస్తువులకు దూరం 
తండాలోని ఇళ్లలో టీవీ, ఫోన్‌ తప్ప ఏ ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువు ఉండదు. తండాలో ఏ ఇంట్లో కూడా ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్, కూలర్‌ లాంటివేవీ ఉండవు.  

మినరల్‌ వాటర్‌కు దూరం 
ఆధునిక కాలంలో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ఇళ్లలో తాగడానికి మినరల్‌ వాటర్‌ వాడుతున్నారు. కానీ, రాజమ్మ తండావాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్‌ ప్లాంట్‌ ఉన్నప్పటికీ మినరల్‌ వాటర్‌ తాగడానికి ఇష్టపడరు.  

కరోనా దరిచేరలేదు
ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్‌ రాజమ్మ తండా దరి చేరలేదు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కరోనా వేళ తండాకు వచ్చి సేఫ్‌ జోన్‌లోకి వెళ్లారు. కరోనా రెండు దశల్లో కూడా ఏ ఒక్కరూ వైరస్‌ బారిన పడలేదు. 

చుట్టూ మంచి వాతావరణం 
నా వయసు 80 ఏళ్లు. రోజూ వ్యవసాయ పనులు చేస్తా. ఎలాంటి రోగాలు లేవు. మక్క రొట్టెలను పొద్దు, మాపు తింటా. ఇంటి చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. మా చుట్టూ ఉన్న వాతావరణమే మాకు రక్షణ. 
–శివరాం, రాజమ్మ తండా 

ఎలాంటి రోగం లేదు 
అప్పటికప్పుడు కట్టెల పొయ్యి మీద చేసిన మక్క రొట్టెలను తింటా. 76 ఏళ్ల వయసులో ఉన్నా. చలి కాలం దగ్గు, జర్వం తప్ప ఎలాంటి రోగం ఇప్పటివరకైతే రాలేదు. 
–మాలిబాయి, రాజమ్మతండా 

బోరు నీళ్లు తాగుతాం..
మాకు మినరల్‌ వాట ర్‌ అంటే తెలియదు. బోరు నీళ్లు తాగుతాం. అడవి నుంచి ఎండిపోయిన కట్టెలను తెచ్చుకుని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం. నాకు 80 ఏళ్లు. ఎలాంటి రోగాలు లేవు. ఎప్పుడైనా జ్వరం వస్తే నీళ్లు గరం చేసి తాగుతా. జ్వరం పోతుంది. 
 –గంగవాత్‌ సోరాత్, రాజమ్మతండా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top