రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణమధ్య రైల్వే షాక్
రాష్ట్ర ప్రభుత్వం: ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాలకు అవకాశం ఇవ్వండి.
దక్షిణ మధ్య రైల్వే: ఆ ప్రతిపాదనపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఎంఎంటీఎస్ విస్తరణ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.491 కోట్లను వెంటనే మాకు చెల్లించండి.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన తరహాలో నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లలో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా ఎవరైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు ప్రతిపాదించింది. దానికి అంతే వేగంగా దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.491 కోట్లను వెంటనే చెల్లించాలని అందులో స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే ఆ బకాయి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
మూడింట రెండొంతుల భారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా...
నగరంలో ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని దశాబ్దంన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం దక్షిణమధ్య రైల్వేను కోరింది. దీంతో పాతనగరంలోని ఫలక్‌నుమా వరకే ఉన్న లైన్‌ను శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ వరకు, సికింద్రాబాద్ నుంచి బొల్లారం–మేడ్చల్ వరకు, తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు , కాచిగూడ నుంచి సీతాఫల్‌మండి–మల్కాజిగిరి–మౌలాలి వరకు.. ఇలా దాదాపు 64 కి.మీ. అదనపు లైన్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ఈ మొత్తం లైన్లలో ప్రస్తుతం సీతాఫల్‌మండి–సీతాఫల్‌మండి బీ కేబిన్ మధ్య కిలోమీటరున్నర మాత్రమే మిగిలి ఉంది. మిగతాది పూర్తయి రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.1305.70 కోట్లుగా ఖరారు చేసింది. ఇందులో రూ.870.47 కోట్లు (మూడింట రెండు వంతులు) రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదిరింది. కానీ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.379.02 కోట్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే లేఖలు రాస్తూ వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటం లేదు.
ఘట్‌కేసర్–యాదగిరిగుట్ట విస్తరణ వాటా కూడా....
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం తర్వాత దేవాలయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీంతో యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడు నెలల క్రితమే ఆ పనులు మొదలయ్యాయి. దానికి దాదాపు రూ.430 కోట్లు వ్యయమవుతుందని రైల్వేతేల్చింది. ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వంరెండొంతుల ఖర్చు భరించాల్సిందే. కానీ, రెండో దశ విస్తరణలో నిధులు ఇవ్వకపోవటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టును సొంత నిధులతోనే పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇప్పుడు అందులో వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకునేందుకు ఒత్తిడి తేబోతోంది.


