
పంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు ఏర్పాటు
పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఖాళీ భూముల్లో కూడా..
వెంటనే ఖాళీ భూములు, భవనాల వివరాలు పంపండి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ భవనాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో ఇందిరా పౌర గిరిజన వికాస పథకం అమలుపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్‌కు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచే పంపిస్తామని తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్లపై కలెక్టర్లు పంపాల్సిన వివరాలతో ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారంలోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
స్కూళ్లపై కూడా సోలార్ ప్లాంట్లు
ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జూని యర్, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వివరా లు పంపాలని కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖల పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీ భూముల వివరాలు సైతం పంపాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఇవి ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.