breaking news
govt buildings
-
ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ భవనాలు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా పౌర గిరిజన వికాస పథకం అమలుపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్‌కు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచే పంపిస్తామని తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్లపై కలెక్టర్లు పంపాల్సిన వివరాలతో ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారంలోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. స్కూళ్లపై కూడా సోలార్ ప్లాంట్లు ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జూని యర్, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వివరా లు పంపాలని కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖల పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీ భూముల వివరాలు సైతం పంపాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఇవి ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. -
కాన్షీరాం జ్ఞాపకార్ధం.. ఖాళీ చేయం
లక్నో: తనకు కేటాయించి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసేది లేదని యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తాను నివాసం ఉంటున్న 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మెమోరియల్‌గా అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఈ మేరకు మాయావతి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కి లేఖ రాశారు. 13ఎ మాల్ ఎవెన్యూ బంగ్లాను 2011లో కాన్షీరాం జ్ఞాపకార్ధం మార్చారని, బంగ్లాలో తనకు కేటాయించి రెండు గదులనే నివాసం కొరకు ఉపయోగించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. బంగ్లా భద్రత, సంరక్షణను తాను క్షేమంగా చూసుకుంటానన్న నమ్మకంతోనే తనకు ఆ బంగ్లాను కేటాయించారని అమె లేఖలో పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్‌లో తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని త్వరలోనే అధికారలకు అప్పగిస్తానని మాయావతి తెలిపారు.కాగా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ ప్రభుత్వం మాజీ సీఎంలు బంగ్లాలు ఖాళీ చేయవల్సిందిగా ఉత్తర్వులు జారిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మాజీ సీఎంలు, అఖిలేష్ యాదవ్, ములాయంసింగ్, ఎన్డీ తివారి బంగ్లాలు ఖాళీ చేయడం కోసం తమకు కొంత సమయం కావాలని యోగి ఆదిత్యానాథ్‌కు లేఖలు రాశారు. -
అమరావతిలో ప్రభుత్వ భవనాల నమూనాలివే...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఛాయాచిత్రాలను రూపొందించారు. కౌలాలంపూర్‌కు చెందిన ఆర్డీఏ హ్యారీస్ ఇండియా కంపెనీ ఆర్కిటెక్చర్లు ఏపీ ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు అందజేశారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. అమరావతిలో భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన నమూనాలు ఇదిగో.. ఈ కింది విధంగా ఉన్నాయి. -
ప్రభుత్వ భవనాలపై వర్క్‌షాప్
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి వివిధ ప్రభుత్వ శాఖల తరలింపునకు అవసరమైన భవనాలను సమకూర్చే బాధ్యతను సీఆర్డీఏ చేపట్టింది. ఇందుకోసం శనివారం నిర్వహించిన వర్క్‌షాపులో 150 ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. తమ శాఖలకు అవసరమైన భవనాల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్‌కు నిర్దేశించిన నమూనాలో అందజేశారు. రాష్ట్ర సచివాలయ, కమిషనర్, డెరైక్టర్, ఇతర కార్యాలయాల అధిపతులు తమ శాఖల తరపున పంపిన నోడల్ అధికారులు తమకు కావాల్సిన భవనాల వివరాలను పేర్కొన్నారు. కృష్ణా నది పక్కన 130 కిలోమీటర్ల పొడవున సీఆర్డీఏ రీజియన్ ఉంటుందని, అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం సముదాయాలు 400 ఎకరాల్లో ఉంటాయని ఈ వర్క్‌షాపులో కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. 2050 నాటికి 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, ప్రతీ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉంటాయని ఆయన చెప్పారు.