అడగండి అది మన హక్కు..పెట్రోల్‌ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం

Six Free Services You Can Avail at Any Petrol Pump Across India - Sakshi

సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్‌పై వ్యాట్‌ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్‌ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. 

స్వచ్ఛమైన తాగునీరు..
బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్‌ ఆర్వో యంత్రం, వాటర్‌ కనెక్షన్‌ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్‌ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. 

మూత్రశాలలు, మరుగుదొడ్లు..
స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్‌ పెట్రోల్, లేదా డీజిల్‌ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. 

ఆపదవేళ ఫోన్‌ సదుపాయం..
అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్‌ బంక్‌ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్‌ కు అయినా కాల్‌ చేసుకోవచ్చు. 

ఉచితంగా గాలి నింపాల్సిందే..
టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్‌ నింపుతున్నారు. ట్యూబ్‌లెస్‌ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్‌ నింపాలి.

ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి..
ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్‌ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. 

నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు..
పెట్రోల్, డీజీల్‌ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు  హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్‌ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. 

అధికారుల పర్యవేక్షణ కరువు..
బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. 
- బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం

అవగాహన కల్పించాలి
బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. 
-మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు

ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు
బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్‌ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. 
-రావెళ్ల కృష్ణారావు, మోటాపురం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top