పెన్‌డ్రైవ్‌లో పలు పేపర్లు! | Sakshi
Sakshi News home page

పెన్‌డ్రైవ్‌లో పలు పేపర్లు!

Published Thu, Mar 16 2023 1:37 AM

SIT has intensified the investigation of case TSPSC Paper Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవçహారంలో కీలక సూత్రధారిగా ఉన్న కమిషన్‌ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్‌ పెన్‌డ్రైవ్‌లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షల పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్‌ తన పనిలో నిమగ్నమైంది.  

యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించి.. 
తన ‘సన్నిహితురాలు’లవడ్యావత్‌ రేణుక కోరడంతో క్వశ్చన్‌ పేపర్ల లీక్‌కు ప్రవీణ్‌కుమార్‌ తెగించాడు. నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌ సహాయంతో రంగంలోకి దిగాడు. పేపర్లన్నీ కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని కంప్యూటర్‌లో ఉంటాయి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కస్టోడియన్‌ శంకరలక్ష్మి వద్ద ఉన్నాయి. వీటిని ఆమె తాను నిత్యం వినియోగించే నోట్‌ పుస్తకం ఆఖరు పేజీలో రాసి పెట్టుకున్నారు. గత నెల ఆఖరి వారంలో ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు దృష్టి మళ్లించడం ద్వారా వాటిని నమోదు చేసుకున్నాడు.

టీఎస్‌పీఎస్సీలోని అన్ని కంప్యూటర్లు ల్యాన్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ అయి ఉంటాయి. ఈ విషయం తెలిసిన రాజశేఖర్‌.. ప్రవీణ్‌ కంప్యూటర్‌ నుంచే శంకరలక్ష్మి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ అయ్యేలా సహకరించాడు. క్షణాల్లో పని కానిచ్చేయాలని భావించిన ప్రవీణ్‌ క్వశ్చన్‌ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్‌ మొత్తం తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు.  

ఫోన్ల విశ్లేషణతోనే పూర్తి స్పష్టత 
ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఏఈ పరీక్ష పత్రం మాత్రమే లీక్‌ అయిందని, ప్రవీణ్‌ ఫోల్డర్‌లో ఉన్న మిగిలిన ప్రశ్న పత్రాలు బయటకు రాలేదని తేల్చారు. దీన్ని సాంకేతికంగా నిర్థారించుకోవాలని నిర్ణయించారు. దీనికోసమే నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 16 ఫోన్లు, ల్యాప్‌టాప్స్, పెన్‌డ్రైవ్స్‌లను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. వాటిలో ఏఏ క్వశ్చన్‌ పేపర్ల షేరింగ్‌ జరిగింది? ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి? వేటిని కాపీ చేశారు? అంశాలను తేల్చనున్నారు. 

యువతుల వ్యవహారం పరిగణనలోకి.. 
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం బుధవారం కమిషనర్‌ సీవీ ఆనంద్‌తో సమావేశమైంది. ప్రాథమికంగా ఈ కేసును సీసీఎస్‌లో రీ–రిజిస్టర్‌ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌తో పాటు ప్రశ్న పత్రాలు భద్రపరిచే విధానం తదితరాలను పరిశీలించారు. కస్టోడియన్‌ శంకరలక్ష్మి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్న 46 మంది మహిళలు, యువతుల వ్యవహారాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. వీరి వ్యవహారాల్లోనూ ఏవైనా లీకేజీలు, ఇతరత్రా కోణాలు ఉన్నాయా? అనేది తేల్చనున్నారు. అవసరమైన వారిని పిలిచి విచారించాలని నిర్ణయించారు.

రెండో ప్రయత్నంలో విషయం లీక్‌..
ఈ ఫోల్డర్‌లో అప్పటికే జరిగిపోయిన, జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ఉండటాన్ని గుర్తించిన ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌కు లాక్‌ సెట్‌ చేశాడు. గత నెల ఆఖరి వారంలోనే రేణుక కోరిన పరీక్ష పత్రం అందజేశాడు. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష (ఈ నెల 12న జరగాల్సిన పరీక్ష), ఇంకా తేదీలు ఖరారు కాని అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టుల పేపర్లను అదును చూసుకుని విక్రయించాలని భావించాడు.

ఏఈ పేపర్‌ను రేణుక తదితరులు నీలేష్‌ , గోపాల్‌లకు రూ.10 లక్షల చొప్పున విక్రయించారు. టౌన్‌ ప్లానింగ్‌ పరీక్ష పత్రం విషయాన్నీ రేణుక వీరికి చెప్పింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే తనకు తెలపాలని కోరింది. ఇలా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం వెతుకుతుండగానే విషయం బయట పడింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement