అన్ని చోట్లా ఆర్‌టీ-పీసీఆర్‌

RT PCR Tests Conducted In PHC Soon In Telangana - Sakshi

పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లోనూ ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం

ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా.. కరోనా లక్షణాలుంటే టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లోనూ ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ఆర్‌టీ–పీసీఆర్‌ కిట్లను పంపించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెద్దాసుపత్రుల నుంచి పీహెచ్‌సీ స్థాయి వరకు 1,100 పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్లా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుతో అరగంటలోపే ఫలితం తెలుస్తోంది. అందులో కరోనా పాజిటివ్‌ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే గుర్తించవచ్చు. కానీ యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని ఐసీఎంఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే నెగెటివ్‌ వచ్చి, లక్షణాలు ఏమాత్రం లేకపోతేనే దాన్ని నెగెటివ్‌గా గుర్తించాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఒకవేళ నెగెటివ్‌ వచ్చి కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్‌ తేల్చిచెప్పింది. కాబట్టి ఇప్పుడు పీహెచ్‌సీ స్థాయిలో యాంటీజెన్‌ టెస్టులు చేయించుకొని నెగెటివ్‌ వచ్చి లక్షణాలున్న వారు సాధారణంగా తిరుగు తున్నారన్న భావన ఉంది. దీంతో అటువంటి వారికి ఇక నుంచి తక్షణమే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తారు. ఆర్‌టీ–పీసీఆర్‌ కోసం తీసుకున్న శాంపిళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీలకు పంపిస్తారు. వాటి ఫలితాలు 24 గంటల నుంచి రెండు, మూడ్రోజుల్లో వస్తాయి.

నేడు కేంద్ర బృందం రాక 
రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలను తెలుసుకునేందుకు సోమవారం కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఇక్కడకు బృందాన్ని పంపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందం సోమవారం పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను పరిశీలించనుంది. మరోవైపు యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారికి లక్షణాలుంటే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది. అయితే హైదరాబాద్‌లో చాలా యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానాల్లో ఇంకాఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు మొదలు కాలేదు. దీంతో ఆగమేఘాల మీద శని, ఆదివారాల్లో ఆర్‌టీ–పీసీఆర్‌ కిట్లను ఆయా సెంటర్లకు పంపించినట్లు తెలిసింది. కేంద్ర బృందం వస్తే ఎలా వ్యవహరించాలో కూడా వారికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను కూడా కేంద్ర బృందం పరిశీలించనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top