మహనీయుల కలలను నిజంచేస్తా

RS Praveen Kumar Betterment Tribal Dalit Bahujan Children In Danthanpally - Sakshi

గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసమే జనంలోకి వచ్చా

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, ఆదిలాబాద్‌: లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని, వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఉట్నూర్‌ మండలం దంతన్‌పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్గమధ్యలో ముత్నూర్‌ వద్ద కుమ్రంభీం విగ్రహానికి, ఇంద్రవెల్లిలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అందరూ అనుకున్నట్టుగా నేను ఫలానా పార్టీలో అభ్యర్థి అనేది ఫేక్‌ న్యూస్‌.. ప్రజలు నమ్మొద్దు’అని పేర్కొన్నారు.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, మాన్యవార్‌ కాన్షీరాం, కుమ్రంభీం, పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు. వీఆర్‌ఎస్‌ ఒకరు చెబితే చేసింది కాదని, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 26 ఏళ్ల వృత్తిలో గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని, అది కేవలం ఒక శాతమేనన్నారు. మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు. పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని, ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు.

ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 26 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన, తొమ్మిదేళ్లుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఉంటూ, ఆ విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చిన సంగతి విదితమే.  ఆయన స్థానంలో  ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్‌రాస్‌కు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top