తుంగభద్ర వాటా రాబట్టుకుందాం | Revanth Reddy seeks Centre intervention on Tungabhadra water | Sakshi
Sakshi News home page

తుంగభద్ర వాటా రాబట్టుకుందాం

Jun 25 2026 1:52 AM | Updated on Jun 25 2026 1:52 AM

Revanth Reddy seeks Centre intervention on Tungabhadra water

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా కలిశారు. చిత్రంలో ఆయన సతీమణి మెహతాబ్‌ చండీ అగిటోక్, డిప్యూటీ సీఎంలు స్నియావ్‌ భలాంగ్‌ ధర్, ప్రెస్టోన్‌ టిన్సాంగ్‌

నికర జలాల వాటా రాబట్టుకోవడానికి కర్ణాటక, ఏపీ సహకారం అవసరం

సమన్వయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి

ఆర్డీఎస్‌ ఆనకట్టలో పూడిక తొలగింపునకు కర్ణాటక సహకారం కోరాలి

తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి 

ఆర్డీఎస్‌ ఆధునీకరణపై నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర జలాల వాటాను సంపూర్ణంగా రాబట్టుకునే విషయంలో కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర జలాశయం నుంచి నది ప్రవాహ మార్గంలో రాష్ట్రానికి హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ఆనకట్ట కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది.

తుంగభద్ర బోర్డు నిర్వహణలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నీటి వాటాల సమర్థ వినియోగానికి బోర్డును పటిష్టపరచాలని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ఆనకట్ట, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర జల వివాదాలపై సమీక్ష నిర్వహించారు. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన నూతన క్రస్ట్‌ గేట్లను గురువారం ప్రారంభించనుండగా, ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలు డీకే శివకుమార్, రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా వారి దృష్టికి ఆర్డీఎస్‌ ఆనకట్ట సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రేవంత్‌ ఈ సమీక్షను నిర్వహించారు. ఆర్డీఎస్‌ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని సీఎం సూచించారు. ఆర్డీఎస్‌ కాల్వ ఆధునికీకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.59 కోట్లు కర్ణాటకకు డిపాజిట్‌ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిలిచిపోయిన 1, 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని గురువారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలతో జరిగే సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఆర్డీఎస్‌ ఆనకట్టలో పూడిక తొలగించాలి
ఆర్డీఎస్‌ ఆనకట్టలో తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడంతో ఆశించిన విధంగా నీటి మళ్లింపు సా­ధ్యం కావడం లేదని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలి­గించాలని సూచించగా, ఆ కమిటీ సిఫారసులు ఇప్పటి­కీ అమలు కాలేదని చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణ­యించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటక­లో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల అమలుకు కేంద్రానికి వినతి పత్రం అందించాలని సీఎం సూచించారు.

అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని సూచించారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అధికారులను నిర్దేశించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపులో కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని అదేశించారు. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్,  సీఎంఓ కార్యదర్శి మాణిక్‌ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement