కరోనా కట్టడికి అన్ని చర్యలు | Report of Director of Public Health to the High Court | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి అన్ని చర్యలు

Dec 19 2020 4:16 AM | Updated on Dec 19 2020 4:22 AM

Report of Director of Public Health to the High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. కరోనా చికిత్సలు చేస్తున్న వైద్యులు, ఇతర మెడికల్‌ సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలంటూ నగరానికి చెందిన ఆర్‌.సమీర్‌ అహ్మద్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన నివేదిక సమర్పించారు. ‘ఇప్పటివరకు 60,81,517 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం. డిసెంబర్‌ 1 తర్వాత రోజూ 50 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం.

రాష్ట్రంలోని వైద్య సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బందికి సంబంధించి రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్లను ఏర్పాటు చేసి అవసరమైన వారందరికీ పరీక్షలు చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు 20 మంది సైకాలజిస్టులు పలు జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌కు 1,409 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధిక బిల్లులు వసూలు చేశారంటూ 277 ఫిర్యాదులు రాగా అందులో 211 పరిష్కరించాం. 65 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరహాలో డెత్‌ ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’అని నివేదించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 31న విచారణ చేయనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement