సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం సంచలనంగా మారింది. కొంత కాలంగా పనితీరు బాగాలేని అధికారులను బదిలీ చేస్తామంటున్న ప్రభుత్వం.. తాజాగా జరిపిన ఐఏఎస్‌ల బదిలీల్లో నగరంతో సంబంధమున్న వారు పలువురుండటం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోనే ఆర్థిక ఇంజిన్‌గా ఉన్న క్యూర్ పరిధిలోని అధికారులు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఎల్‌ఈటీ అండ్‌ఎఫ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా బదిలీ కాగా.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల హైదరాబాద్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
జోన్లకు జవసత్వాలు?
క్యూర్‌లోని ఆరు జోన్ల జోనల్ కమిషనర్లను మార్చడం సంచలనంగా మారింది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓ పి.ఉదయ్‌కుమార్‌ను గోల్కొండ జోనల్ కమిషనర్‌గా, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా, బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతోను ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్‌గా, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్‌ను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం చారి్మనార్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ఎస్. శ్రీనివాస్‌రెడ్డి (నాన్ క్యాడర్)ను రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు.
గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డిని ఐఅండ్‌పీఆర్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రతీక్ జైన్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీచేశారు. బాన్స్‌వాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియమించారు. క్యూర్ పరిధిలోని అధికారులు కొద్దికాలం గడవకముందే బదిలీ అవుతుండటంతో పాలన వ్యవస్థ గాడిన పడటం లేదు. మూడు కార్పొరేషన్లుగా మారాక ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్న కొత్త కార్పొరేషన్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది.


