“ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ కట్‌ చేయమంటారా’

Private Schools Extra Fee Issue In Karimnagar - Sakshi

కరీంనగర్‌ పట్టణం బ్యాంక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ పేరున్న పాఠశాలలో అతడి కొడుకును 9వ తరగతి చదివిస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నా డు. ఈక్రమంలో అబ్బాయి ఫీజు చెల్లించాలంటూ సదరు వ్యక్తిని పాఠశాల యాజమాన్యం వారం రోజులుగా ఫోన్‌ చేస్తూ ఒత్తిడి తెస్తోంది. లేకుంటే ఆన్‌లైన్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రూ.15 వేలు చెల్లించగా, అవి పాత బకాయి కింద జమ చేసుకున్నట్లు సదరు పాఠశాల యాజమాన్యం చెప్పిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి’కి తెలిపాడు. వారం రోజుల పాటు ఆన్‌లైన్‌ తరగతులు వినేలా లింక్‌ ఇచ్చారని, ఆ తర్వాత కట్‌ చేస్తామని చెప్పారని వాపోయాడు. ఫీజు తర్వాత కడుతామని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి తండ్రిని కూడా ఫీజు చెల్లించాల ని వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున చెల్లించా నని మరో రూ.15 వేలు చెల్లించాలని పాఠశాల నిర్వాహకులు తరచూ ఫోన్‌ చేయడంతో పిల్లల ఒత్తిడి తట్టుకోలేక అవి కూడా ఇటీవలే చెల్లించానని వాపోయాడు. అయితే మొదట చెల్లించిన రూ.15 వేలు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద పాఠశాల యాజమాన్యం చూపిస్తోందని, అంతే కాకుండా ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు ప్రత్యేకంగా రూ.1,250 చెల్లించాలనే నిబంధన పెట్టినట్లు ఆ విద్యార్థి తండ్రి చెప్పాడు.

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో పేరున్న పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. నగరంలోని మంకమ్మతోట, వావిలాలపల్లి, భగత్‌నగర్, గణేశ్‌నగర్‌ తదితర కాలనీల్లో ఉన్న కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. అయితే సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం ఈ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.  “ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ కట్‌ చేయమంటారా’.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నాయి. 

చెప్పిన చోటే పుస్తకాలు కొనాలి
కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. వారికి కమీషన్‌ ఇచ్చే దుకా ణాల్లో మాత్రమే స్టడీ మెటీరియల్‌ కొనాలని షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని కరాఖండిగా చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీ సుకోవడం లేదు. కనీసం పాఠశాలలను తనిఖీ చే యడం లేదు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుందనే దానిపై కూడా దృష్టిసారించడం లేదు. 

జబర్దస్త్‌గా ఫీజు వసూలు
అసలే కరోనా సమయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు.. అయినా కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజు కడితేనే ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతిస్తున్నారు. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే ఆలోచనతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు కట్టిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. గత నెలరోజుల నుంచి ఫీజుల వసూళ్లపై దృష్టి సారించారు. మెస్సెజ్‌లు పెడుతూ, నేరుగా ఫోన్‌లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని, కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. జీవో నం.46 ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు తప్ప ఎలాంటి ఫీజులు తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నా ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు అమలు చేయడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్‌ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాలి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. 

– జూపాక శ్రీనివాస్,పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు 

జీవో ప్రకారం  వసూలు చేయాలి
జీవో నం.46 ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రతీనెల ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. అధిక ఫీజుల విషయంపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే దృష్టిసారిస్తాం.

– జనార్దన్‌రావు, డీఈవో  

చదవండి: వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top