
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 24వ తేదీతో గడువు ముగియగా.. 10 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. దీంతో గడువు పెంపు అనివార్యమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని సంక్షేమ శాఖలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా డిసెంబర్ 31వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఏర్పడింది.