Telangana: పాఠశాలల్లో కరోనా కలకలం

Positive for 10 govt teachers in Single day in Bhadradri and Yadadri - Sakshi

భద్రాద్రి, యాదాద్రి జిల్లాల్లో ఒకేరోజు 10 మంది ప్రభుత్వ టీచర్లకు పాజిటివ్‌

ఆ పాఠశాలల్లో విద్యార్థులందరికీ పరీక్షలు 

నెగటివ్‌ వచ్చిన చోట యథావిధిగా క్లాసులు 

జూలూరుపాడు/బూర్గంపాడు/పినపాక /దమ్మపేట/టేకులపల్లి/యాదాద్రి: పాఠశాలలు తెరిచిన మూడో రోజునే భద్రాద్రి కొత్త గూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కరోనా కలకలం సృష్టించింది. భద్రాద్రి జిల్లాలో ఆరుగురు, యాదాద్రి జిల్లాలో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలంలోని 154 మంది ఉపాధ్యాయులకు పరీక్షలు చేయగా, పాపకొల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఆ వెంటనే పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.వీరబాబు ఆధ్వర్యాన ఆ పాఠశాల లోని 203 మంది విద్యార్థులు, ఏడుగురు సిబ్బందికి పరీక్ష చేయగా ఎవరికీ కరోనా నిర్ధారణ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బూర్గంపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(బాలికల) ఉపాధ్యాయురాలికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా 11మంది ఉపాధ్యాయులకు, సిబ్బంది, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యార్థులకు కోవిడ్‌ టెస్ట్‌ చేయించగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. ఈ మేరకు నివేదిక రాగా పాఠశాల యథావిధిగా నిర్వహించారు. పినపాక మండలం పోతిరెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలికీ కరోనా సోకినట్లు తేలడంతో పిల్లలను ఇంటికి పంపించి శానిటైజ్‌ చేశారు. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా పాఠశాల ఉపాధ్యాయిని, కోయగూడెం అంగన్‌వాడీ టీచర్‌కు కరోనా సోకినట్లు తేలింది. దమ్మపేట మండలం రంగువారిగూడెం యూపీఎస్‌ ఉపాధ్యాయుడికి,కరకగూడెం మండలం వెంకటాపురం పాఠశాల ఉపాధ్యాయుడి కరోనా సోకింది. 

ఒకే పాఠశాలలో ముగ్గురికి 
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌ శివారు మేడిపల్లిలో ఉండే వంగపల్లి హైస్కూల్‌ హెచ్‌ఎం సుదర్శన్‌.. నారపల్లిలో ఉండే ఇద్దరు ఉపాధ్యాయులు రవి, వెంకట్‌రెడ్డితో కలసి ఒకే కారులో పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. వీరికి కరోనా రావడంతో పాఠశాలలోని మిగతా టీచర్లు, సిబ్బంది పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆదివారం విద్యార్థులందరికీ పరీక్షలు చేయడానికి గ్రామంలో క్యాంపు నిర్వహిస్తా మని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సాంబశివరావు తెలిపారు. కాగా, వంగపల్లి ఉపాధ్యాయుడు రవి భార్యకూ పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆమె బీబీనగర్‌ మండలం గూడూరు హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top