పోలీసు పరీక్షల్లో ఎత్తు ఇక పక్కా!

Police Department Brings New Machine to Measure Candidates Height - Sakshi

అభ్యర్థుల ఎత్తును కొలిచేందుకు అధునాతన యంత్రం

మెర్క్యురీ బ్యాలెన్స్‌తో అవకతవకలకు చెక్‌

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసు నియామక పరీక్షల్లో అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు అత్యంత ఆధునిక యంత్రాన్ని పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. మెర్క్యురీ బ్యాలెన్స్‌ అనే అత్యాధునిక యంత్రాన్ని పోలీసు శాఖ కొనుగోలు చేసింది. ఇకపై తెలంగాణ పోలీసు శాఖ భర్తీ చేసే కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల్లో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించే క్రమంలో దీని సేవలు వాడుకోనున్నారు. సాధారణంగా పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలకు 152.5 సెంటీమీటర్లు ఎత్తుగా నిర్ధారించారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా కొన్ని వర్గాలకు కాస్త మినహాయింపు ఉంటుంది. గతంలో ఎత్తు విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా ఎంపిక ప్రక్రియపై తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేసేవారు. ఇలాంటి వ్యవహారాల వల్ల నియామక ప్రక్రియను ప్రభావితం అయ్యే అవకాశముంది. దీనివల్ల ఇటు అభ్యర్థులు, అటు ఉన్నతాధికారులకు సమయం వృథా అవుతోంది. అందుకే, ఇకపై అలాంటి వివాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు మెర్క్యురీ బ్యాలెన్స్‌ అనే యంత్రాన్ని తెలంగాణ పోలీసులు కొనుగోలు చేశారు. పూర్తిగా పాదరసం ఆధారంగా ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం అభ్యర్థుల ఎత్తును అత్యంత కచ్చితంగా లెక్కగడుతుంది. 

అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు.. 
ప్రభుత్వంలోని వేరే శాఖల్లో పనిచేసిన కొందరు అభ్యర్థులు తమ ఎత్తు విషయంలో సమర్పించే సర్టిఫికెట్లలో ఎత్తు విషయంలో వ్యత్యాసాలుంటాయి. సాధారణంగా నిబంధనలకు విరుద్ధంగా మిల్లీమీటర్‌ తేడా ఉన్నా పోలీసు శాఖలో అంగీకరించరు. కానీ, కొందరు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసిన వారు, కొన్ని సంస్థల్లో శిక్షణ తీసుకున్న వారు తమ ఎత్తు విషయంలో నిజాలు దాస్తారు. వాస్తవంగా ఒకలా, వారు తెచ్చిన సర్టిఫికెట్లలో మరొకలా ఉంటుంది. వ్యత్యాసం స్వల్పమే అయినా.. వారి వాదన నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. వీరిలో చాలామంది చూపించే వ్యత్యాసం కూడా మిల్లీమీటర్లలోనే ఉంటుంది. ఇకపై అలా వాదించే వారికి మెర్క్యురీ బ్యాలెన్స్‌ మెషీన్‌ ఫలితాలనే సమాధానంగా చూపనున్నారు పోలీసులు.. త్వరలో పోలీసు శాఖలో 20 వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలపై డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీసు శాఖ కూడా సిద్ధంగా ఉంది. ఈసారి 6 లక్షలకు పైగా అభ్యర్థులు 20 వేల పోస్టులకు పోటీ పడవచ్చని అంచనా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top