తెలంగాణలో ఉల్లి దిగుతోంది

Onion Prices Cheer Drop In Telangana - Sakshi

మార్కెట్‌లో కిలో రూ. 25–30 

వారంలోనే రూ. 15–20 తగ్గుదల 

మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి పెరిగిన దిగుమతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్‌లో ఉల్లి సాగు అసలు లేకపోయినా... పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో మార్కెట్లలో తగ్గిన డిమాండ్‌తో అక్కడి వ్యాపారులంతా రాష్ట్రానికి ఉల్లిని తెస్తుండటంతో ధర తగ్గుతోంది. నిజానికి రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21 వేల ఎకరాల మేర ఉండగా, ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు జరగలేదు. ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతాయని అంతా అంచనా వేశారు.  

ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణంగానే ఉల్లి ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే రూ.40–45 మధ్య ఉంటుంది. రాష్ట్రంలో అసలే సాగు లేకపోవడంతో ప్రస్తుతం సైతం ధరలు పెరగుతాయని భావించినా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా వస్తుండటంతో ధరలు తక్కువగా ఉన్నాయి. వారం కిందటి వరకు మలక్‌పేట్‌ మార్కెట్‌లో మేలురకం ఉల్లి ధర కిలో రూ.35–45 మధ్య ఉండగా, అది ఇప్పుడు రూ. 25–30కు పడిపోయింది. కిలోకు ఏకంగా రూ.15–20 మేర తగ్గింది. ఇక రిటైల్‌లోనూ మొన్నటి వరకు కిలో రూ.50 అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం కిలో రూ.35 వరకు అమ్ముతున్నారు.

ఇక సాధారణ రోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 6 వేల నుంచి 7 వేల క్వింటాళ్ల మేర ఉల్లి దిగుమతి అవుతుండగా, ఆదివారం రోజులుగా 8 వేల క్వింటాళ్ల నుంచి 9 వేల క్వింటాళ్లకు పెరిగింది. శుక్రవారం వ్యాపారుల భారత్‌ బంద్‌ ఉన్నప్పటికీ శనివారం ఏకంగా 9,600 క్వింటాళ్ల ఉల్లి రాష్ట్రానికి వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచే 5–6 వేల క్వింటాళ్ల మేర ఉల్లి వస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతితో హోటళ్లు, రెస్టారెంట్‌లు పెద్దగా నడవకపోవడంతో సరుకును రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాసల్‌గావ్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ మొన్నటివరకు రూ.4,500 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.3,000కు తగ్గింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉల్లి ధరలు అదుపులో ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top