ఇంజనీరింగ్‌ ఫీజుపై నిర్ణయించలేదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

No decision on engineering fees Minister Sabitha Indra Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వార్షిక ఫీజుల పెంపు నిలిపివేతపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్‌ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు. రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్‌లో బాలికలు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top