కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి రాంరాం!

No chance of rail coach factory in Kazipet - Sakshi

కోచ్‌ ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో ఉన్నాయన్న రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు.  

భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు
2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్‌ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్‌ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top