సర్పంచ్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం

Nizamabad Sarpanch Husband Attempt Suicide At Collectorate - Sakshi

అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులు భారంగా మారాయని వెల్లడి 

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఘటన

సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ సర్పంచ్‌ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్‌ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా  ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే  దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు.

బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్‌ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు.  పార్టీ మారినా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బిల్లులు, చెక్‌ పవర్‌ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు.

వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్‌ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్‌ వచ్చే వరకూ కలెక్టరేట్‌ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్‌ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top