పీడియాట్రిక్‌ అధ్యయన కేంద్రంగా నిలోఫర్‌

Niloufer Hospital As A Center Of Pediatric Study - Sakshi

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ 

థర్డ్‌వేవ్‌.. ఫ్రెండ్‌లా వస్తుంది 

ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి  

ముందస్తు చర్యలపై వైద్యులతో చర్చ  

నాంపల్లి: ‘కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ అంటూ వస్తే ఫ్రెండ్‌లాగా వస్తుంది. మనందరి ఆలోచనల్లో అది రాకూడదనే ఉంటుంది. కానీ, ఒకవేళ వస్తే మన సేవల్లో లోటుపాట్లు ఉండకూడదు. రోగాన్ని నిరోధించడానికి 200 శాతం మనం సిద్ధంగా ఉండాలి’అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ చిన్నపిల్లల ఆస్పత్రి అయిన నిలోఫర్‌ వైద్యులకు సూచించారు. ‘థర్డ్‌ వేవ్‌ నివారణకు కావాల్సిన మందులు, డయాగ్నోస్టిక్స్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఆర్డర్‌ చేశాం. వీటితోపాటు అదనపు సిబ్బందిని సమకూర్చుకొని సూపర్‌ స్పెషాలిటీ కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా నిలోఫర్‌ పనిచేయాలి.
 

ఈ ఆస్పత్రి వైద్యసేవలు అందించడంతోపాటు అధ్యయన కేంద్రంగా మారాలి. ఇతర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా చిన్న పిల్లలకు ఎలాంటి వైద్యసేవలు అందాలో మీరే ఒక ప్రణాళికను రూపొందించాలి. చిన్న పిల్లల మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించే దిశగా ఆలోచనలు మెరుగుపడాలి’అని అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న నిలోఫర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ బ్లాక్, పాత భవనసముదాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడారు. ‘థర్డ్‌వేవ్‌ గురించి వింటున్నప్పటి నుంచి నేను నిలోఫర్‌కు రావాలని, ఇక్కడేమి జరుగుతుందో చూడాలని భావించానన్నారు. 

ఎన్ని కేసులు వచ్చినా... 
నిలోఫర్‌ ఆస్పత్రిలో పడకల సంఖ్య రెట్టింపైతే ఏ కేసు వచ్చినా ఎదుర్కొనగలుగుతామని, వైద్యులకు నిరంతర శిక్షణ సాగాలని సీఎస్‌ అన్నారు. ప్రస్తుతం ఇక్కడ థర్డ్‌వేవ్‌ లక్షణాలు కలిగిన ఐదారు కేసులు ఉన్నాయని, నిలోఫర్‌ను ఆరువేల పీడియాట్రిక్స్‌ పడకలు, 1,500 కోవిడ్‌ పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన వారే కాదు, మన ప్రక్కన ఉన్న నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులు వస్తారు. వారికి కూడా మనమే చూడాలన్నారు.

ఆస్పత్రి భవనం టెర్రస్‌ మీదకు వెళ్లి..
నిలోఫర్‌ ఆస్పత్రి భవనం టెర్రస్‌ మీదకు సోమేశ్‌ కుమార్‌ వెళ్లి ప్రాంగణాన్ని పూర్తిగా సర్వే చేశారు. తాత్కాలిక షెడ్లు వేస్తే ఎన్ని పడకలు అందుబాటులోకి వస్తాయంటూ అధికారులతో చర్చించారు. అనంతరం పాత భవనం పైకప్పుపై కలియదిరిగారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న పీడియాట్రిక్‌ విభాగాలను పరిశీలించారు. సుమారు గంటన్నరపాటు ఆసుపత్రిలో ఉంటూ వైద్యులతో థర్డ్‌వేవ్‌పై సమీక్షించారు.

అక్టోబర్‌లోగా అందరికీ వ్యాక్సిన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్‌ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారని, అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బ్యాంక్‌ అధికారులు, సిబ్బందికి చేపట్టాల్సిన వ్యాక్సినేషన్‌పై శనివారం ఆయన వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top