రేషన్‌ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి | New Rule in Ration Cards | Sakshi
Sakshi News home page

రేషన్‌ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి

Jul 30 2026 9:09 AM | Updated on Jul 30 2026 9:12 AM

New Rule in Ration Cards

వికారాబాదు జిల్లా: పౌర సరఫరాల శాఖ ఈ – కేవైసీని తప్పనిసరి చేసింది. రేషన్‌ కార్డులో పేరుండి ఐదేళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డీలర్‌ వద్ద వేలిముద్రలు వేయాలి.. లేకపోతే రేషన్‌ పంపిణీ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. పారదర్శకత, బోగస్‌ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ – కేవైసీ జిల్లాలోని చాలా కుటుంబాలను కలవరానికి గురి చేస్తోంది. 

లక్షలాది మంది లబ్ధిదారులు వేలిముద్రలు ఇవ్వలేదు. డీలర్లు ఫోన్లు చేసి ఈకేవైసీ చేయించాల్సి వస్తోంది. జిల్లాలో 2,90,383 రేషన్‌ కార్డులు.. 9,88,144 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 7,07,907 మంది ఈ కేవైసీ చేసుకున్నారు. ఇప్పటి వరకు 71.64 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2,80,237 మంది పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. రేషన్‌ కార్డులో చనిపోయిన వారి పేర్లు, వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో కార్డులు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాటిని తొలగించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

సాంకేతిక ఇబ్బందులు
ఈ – కేవైసీ వృద్ధులు, శ్రామికులకు ఇబ్బందిగా మారింది. ఏళ్లుగా పని చేస్తుండటంతో వేళ్లపై చర్మం అరిగిపోయి ఈ – కేవైసీ యంత్రంలో ముద్రలు పడటం లేదు. వృద్ధుల ఐరిష్‌ క్లిష్టతరంగా మారింది. కంటిలో శుక్లాలు, చూపు మందగించడం ఐరిష్‌ క్యాప్చర్‌ కావడం లేదు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వయస్సు పిల్లలు 10 నుంచి 15 సార్లు ప్రయత్నం చేసినా రావడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తీవ్ర వైకల్యం, పక్షవాతం, మంచానపడ్డ వృద్ధులు స్వయంగా రేషన్‌ దుకాణానికి వచ్చి పరిస్థితి లేదు. ఇలాంటి వారు తమ పేర్లను తొలగించరాదని, ఎప్పటిలాగే రేషన్‌ పంపిణీ చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

నమోదు  చేస్తేన్నాం
రేషన్‌ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. లబ్ధిదారుల వేలి ముద్రలు, ఐరిష్‌ తీసుకుంటున్నాం. కొందరివి క్యాప్చర్‌ కావడం లేదు. చాలా సేపు ప్రయత్నించాల్సి వస్తోంది.
– నరేందర్‌, రేషన్‌ డీలర్‌, బొంపల్లి

చర్యలు తీసుకుంటున్నాం
సాంకేతిక సమస్యలతో అర్హులకు రేషన్‌ కట్‌ కావొద్దనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం. అనారోగ్యం, వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి ఈ–కేవైసీ చేయిస్తాం. వలస కూలీలు వారు ఉన్న ప్రాంతాల్లో డీలర్ల వద్దకు వెళ్లి ఈ – కేవైసీ చేయించుకోవచ్చు. 
– గణపతిరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement