మావోయిస్టు ఇలాఖాల్లో పోస్టాఫీసులు 

New Post Offices In Telangana Districts - Sakshi

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 418 కొత్త తపాలా కార్యాలయాలు 

కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 

మార్చి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తపాలా కార్యాలయాలు తెరవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్‌ పరిధిలోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 418 పోస్టాఫీసులు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి ప్రారంభం కావాలని కేంద్రం ఆదేశించింది. భద్రాద్రి–కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో ప్రారంభం కానున్నాయి. 

అప్పట్లో నామమాత్రంగా 
గతంలో పోస్టాఫీసుల్లో టెలీఫోన్‌ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది. దీంతో తమ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరుస్తున్నారన్న అనుమానంతో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు తపాలా కార్యాలయాలను, టెలిఫోన్‌కు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంతకాలం తపాలా కార్యాలయాలు నామమాత్రంగా ఉండేవి.

గత కొన్నేళ్లలో తపాలా కార్యాలయాల ద్వారా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చారు. కానీ తపాలా కార్యాలయాలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలు వీటికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు సాధారణ ప్రాంతాల్లో ఉన్నట్లే ఈ ప్రాంతాల్లో కూడా తపాలాకార్యాలయాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఆయా పథకాలు అందేలా చేయాలని కేంద్రం నిర్ణయించింది.    

జిల్లాల వారీగా తెరవనున్న కొత్త పోస్టాఫీసుల సంఖ్య ఇలా.. 
భద్రాద్రి కొత్తగూడెం 154, వరంగల్‌ 71, భూపాలపల్లి 65, ఖమ్మం 58, పెద్దపల్లి 38, ఆసిఫాబాద్‌ 12, ఆదిలాబాద్‌ 12, మంచిర్యాల 9  

పోస్టాఫీసుల ద్వారా ఎన్నో సేవలు 
రైలు బస్సు టిక్కెట్ల బుకింగ్, సిమ్‌కార్డు, డిష్‌ టీవీ రీచార్జి, పాస్‌పోర్టు సేవలు, ఆధార్‌కార్డులో వివరాల మార్పు ఇలా ఎన్నో సేవలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక పింఛన్లు, రైతుబంధు, కేంద్ర పథకాల ద్వారా లబ్ధిదారులకు నగదు చెల్లింపు కూడా తపాలాకార్యాలయాల ద్వారా జరుగుతోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందికే హ్యాండ్‌హెల్డ్‌ యంత్రాలు కేటాయించి లబ్ధిదారుల వద్దకే వెళ్లి చెల్లించేపద్ధతి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకును కూడా తపాలాశాఖ ప్రారంభించటంతో బ్యాంకింగ్‌ సేవలు కూడా పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సేవలు ఆయా ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top