సాక్షి, నల్లగొండ: పట్టణంలోని గొల్లగూడలో ఉన్న భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని రికార్డుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు రికార్డు రూమ్ అంతటా విస్తరించడంతో లోపల ఉన్న కీలక పత్రాలు, దస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి సుమారు రెండు గంటలుగా అధికారులు శ్రమిస్తున్నా ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్ పరిధిలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. ఊపిరి ఆడక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యక్తమవుతుఉన్న అనుమానాలు
గోడౌన్‌లోని ఇతర విభాగాలకు కాకుండా, కేవలం కీలక సమాచారం ఉండే రికార్డు రూములోనే మంటలు చెలరేగడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ లావాదేవీలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కాలిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.


