Munugode Bypoll: 1952 నుంచి మునుగోడు.. పన్నెండవది

Nalgonda District 11 by elections for Assembly Seats Since 1952 - Sakshi

సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1952 నుంచి అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు 11 ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మునుగోడులో 12వ ఉప ఎన్నిక జరుగబోతోంది. ఇందులో భువనగిరి, హుజూర్‌నగర్‌ స్థానాలకు రెండు సార్లు ఉపఎన్నికలు జరగడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిలు జరుగగా, మునుగోడుతో మూడో ఉప ఎన్నిక అవుతుంది.

ఇవీ ఉప ఎన్నికల వివరాలు..
►1952 సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు నాయకుడు, పీడీఎఫ్‌ అభ్యర్థి రావి నారాయణరెడ్డి భువనగిరి అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల నుంచి ఏకకాలంలో గెలుపొందారు. దీంతో ఆయన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా.. అదే సంవత్సరం ఉప ఎన్నిక జరిగింది.
►భువనగిరి శాసనసభ స్థానానికి మళ్లీ 2000 సంవత్సరంలో ఉప ఎన్నిక జరిగింది. 1999 సాధారణ ఎన్నికల తర్వాత ఎలిమినేటి మాధవరెడ్డి నక్సల్స్‌ చేతిలో హత్యకు గురయ్యారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో మాధవరెడ్డి భార్య ఉమామాధవరెడ్డి పోటీచేసి గెలుపొందారు. 
►హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 1952లో పీడీఎఫ్‌ అభ్యర్థి జయసూర్య గెలుపొందారు. అదే సమయంలో ఆయన మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. దీంతో జయసూర్య హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా.. అదే సంవత్సరం ఉప ఎన్నిక జరిగింది. 

చదవండి: (Munugode Bypoll: నల్లగొండ, యాదాద్రిలో ఎన్నికల కోడ్‌)

►హుజూర్‌నగర్‌కు మళ్లీ 2019లో ఉప ఎన్నిక జరిగింది. 2018 సాధారణ ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 
►మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడకముందు పెదమునగాల కేంద్రంగా నియోజకవర్గం ఉండేది. ఆ స్థానానికి 1952లో ఉప ఎన్నిక జరిగింది. 
►మునుగోడు నియోజకవర్గం ఏర్పడకముందున్న చిన్నకొండూరు అసెంబ్లీ స్థానానికి 1965లో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. 
►2004 ఎన్నికల వరకు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గానికి 1974లో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన వడ్డేపల్లి కాశీరాం మృతిచెందడంతో బైఎలక్షన్‌ వచ్చింది.

►నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985 సాధారణ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గెలుపొందారు. ఆయన నల్లగొండతో పాటుమరో మూడు స్థానాల్లో పోటీచేసి విజయం సాధించారు. దీంతో నల్లగొండ సీటుకు రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గడ్డం రుద్రమదేవి గెలుపొందారు. 
►దేవరకొండ నుంచి 1999లో గెలుపొందిన కాంగ్రెస్‌ నేత ధీరావత్‌ రాగ్యానాయక్‌ 2001 డిసెంబర్‌లో నక్సల్స్‌ కాల్పుల్లో మరణించారు. ఈ స్థానానికి 2002లో ఉప ఎన్నిక నిర్వహించగా రాగ్యానాయక్‌ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

►ఆలేరు నియోజకవర్గానికి 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నగేష్‌ గెలుపొందారు. అయితే, మళ్లీ సాధారణ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు.. కేసీఆర్‌ పిలుపులో భాగంగా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అందులో నగేష్‌ కూడా ఉన్నారు. తెలంగాణ నినాదం బలంగా ఉందని చాటడం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ వ్యూహం అమలు చేసింది. 2008లో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ నగేష్‌ విజయం సాధించారు. 
►నాగార్జునసాగర్‌ నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో నర్సింహయ్య తనయుడు భగత్‌ గెలుపొందారు.
►రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top