నాయబ్‌.. సీనియారిటీ గాయబ్‌!

Naib Deputy Working In Revenue Department Been Accused Of Injustice To Tehsildar - Sakshi

ఉద్యోగుల విభజనలో డైరెక్ట్‌ రిక్రూటీ నాయబ్‌ తహసీల్దార్లకు అన్యాయం 

జోనల్‌ సీనియారిటీని మల్టీజోన్‌గా పరిగణిస్తున్న సీసీఎల్‌ఏ అధికారులు 

రెవెన్యూ శాఖ పరిధిలో సీనియారిటీ జాబితాలు ప్రదర్శించని ఉన్నతాధికారులు  

ఆప్షన్లు అడగకపోవడంతో కోర్టుకు వెళ్లే ఆలోచనలో వీఆర్వోలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల విభజనలో భాగంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నాయబ్‌ (డిప్యూటీ) తహసీల్దార్లకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఉద్యోగాల్లో నేరుగా భర్తీ అయిన (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఈ నాయబ్‌ తహసీల్దార్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకునే విషయంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయ వర్గాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి, రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది పదోన్నతిపై వచ్చినవారు కాగా, 30 శాతం మంది నేరుగా భర్తీ అయినవారు ఉంటారు.

ఇందులో పదోన్నతుల ద్వారా నాయబ్‌ తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారి సీనియారిటీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోనల్‌ స్థాయి అయిన ఈ పోస్టుకు సీనియారిటీ జాబితాలు తయారు చేసేందుకు కొత్త జోనల్‌ విధానంలో కాకుండా పాత జోన్‌ పరిధిలోకి వచ్చే అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి సీనియారిటీని లెక్కగడుతున్నారని డైరెక్ట్‌ రిక్రూటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి ఫిర్యాదు కూడా చేశారు.

కానీ, సీసీఎల్‌ఏ వర్గాలు మాత్రం తాము అనుకున్న పద్ధతిలోనే వెళుతున్నాయని రెవెన్యూ సంఘాల నేతలంటున్నారు. అలా చేయడం ద్వారా పాత జోన్లవారీగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాల ప్రాంతాల్లోకి ప్రమోటీ నాయబ్‌ తహసీల్దార్లు వెళితే, మారుమూల ప్రాంతాలు, చిన్న జిల్లాలకు డైరెక్ట్‌ రిక్రూటీలు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. కొత్త జోన్‌ల ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేస్తే కొన్ని జిల్లాల్లో అయినా డైరెక్ట్‌ రిక్రూటీలు మంచి ప్రాంతాల్లో పోస్టింగులు పొందే అవకాశం ఉంటుందని, లేదంటే సర్వీసు పూర్తిగా మారుమూల ప్రాంతాలకే పరిమితం అవుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే సీనియర్‌ అసిస్టెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాలను సీసీఎల్‌ఏ సిద్ధం చేస్తుండగా, సీనియర్‌ అసిస్టెంట్‌ కంటే కింది కేడర్‌ జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలు తయారు చేస్తున్నారు. అయితే, ఏ స్థాయిలోనూ వీరి సీనియారిటీ జాబితాలను ప్రదర్శించడం లేదని, కనీసం ఏదైనా అభ్యంతరం తెలిపేందుకు, సూచన చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని రెవెన్యూ సంఘాలంటున్నాయి.

ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే ఇప్పుడు వారి అభ్యంతరాలు, సూచనలు తీసుకోవాలంటే ప్రభుత్వం తమకిచ్చిన గడువు సరిపోదని, వీలున్నంత పారదర్శకంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ స్థాయిల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం చేస్తున్నామని చెపుతున్నారు.  

వీఆర్వో.. నోఆప్షన్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న 5,500 మంది ఉద్యోగుల ఆప్షన్లను ప్రభుత్వం స్వీకరించడం లేదు. ఇప్పటికే ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 14 నెలలు దాటినా ఇంతవరకు వారి జాబ్‌చార్టును ప్రభుత్వం ఖరారు చేయలేదు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వారి నుంచి ఆప్షన్ల స్వీకరణను నిలిపివేసినట్టు తెలుస్తోంది. అన్ని శాఖల్లో విభజన పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలు, ఆయా శాఖల్లోని అవసరాల ఆధారంగా వీఆర్వోలను సర్దుబాటు చేసి ఆ తర్వాత లోకల్‌ కేడర్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, తమ నుంచి ఆప్షన్లు స్వీకరించకపోవడం, స్కేల్‌ ఉద్యోగులందరితో సమానంగా తమను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం సరైంది కాదని, దీనిపై తాము కోర్టుకు వెళతామని వీఆర్వోల సంఘాలు చెపుతున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top