తీజ్‌ సంబరాలు: తీన్మార్‌ వేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

MP Ramulu And MLA Guvvala BalaRaju Dance In Theej Festival - Sakshi

అంబరాన్నంటిన తీజ్‌ సంబురం

ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యం

ఉట్టిపడిన గిరిజన సంస్కృతి

అచ్చంపేటలో భారీ ఊరేగింపు.. నిమజ్జనం

హాజరైన ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య స్వల్పవాగ్వాదం

అచ్చంపేట: తీజ్‌ సంబురాలు అచ్చంపేట లో ఆదివారం అంబరాన్నంటాయి. జాగో బంజారా.. బొరావ్‌ తీజ్‌ అంటూ.. గిరిజనులు మొలకల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 21న ప్రారంభించిన తీజ్‌ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ముగింపు వేడుకలు పురస్కరించుకుని సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు చేసిన నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో యువతులు తీజ్‌ బుట్టలను తలపై ఉంచి కుటుంబసభ్యులతో కలిసి బహిరంగ ఊరేగింపులో సంప్రదాయ నృత్యం చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి గిరిజన బంధువులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించారు.

చెరువులో నిమజ్జనం..
గిరిజన భవన్‌ వద్ద పందిరిపై ఏర్పాటు చేసిన తీజ్‌ బుట్టలను (మంచెపై) దింపి పీటమీద పెట్టి ఆట,పాటలతో తీజ్‌ నారును తెంపారు. రేగుచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమనారు(డోనా) చిన్న కర్ర(పీట)లతో యువతీ, యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించారు. మొలకల బుట్టలను తలపై పెట్టుకున్నారు. అమ్మాయిలతో పాటు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు అంతాకలిసి ఊరేగింపుగా బయలుదేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన తండాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. బుట్టలతో ఊరేగింపుగా నడింపల్లి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర తమ సంప్రదాయ పద్ధతులతో మొలకల బుట్టలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. పూజలలో పాల్గొన్న అమ్మాయిలు తీసుకున్న రొట్టెలు, ఆకుకూరల ఆహారాన్నే సంప్రదాయ రీతిలో అందరూ అక్కడ తీసుకున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన గిరిజన భవన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దమనషులకు యువతులు కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం పొందారు. అమ్మాయిలకు కూడా పెద్దమనషులు కాళ్లు కడిగి ఆశీర్వదించారు.

ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నృత్యం  
మొలకల పండుగ ఊరేగింపులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, మనోహర్, మార్కెట్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాలజీ పాల్గొన్నారు. ఎంపీ రాములు గిరిజనులతో పాటు నృత్యం చేశారు. బంజారా గిరిజనులతో పాటు ఎమ్మెల్యేగువ్వల బాలరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. అమల మొలకలను తలపై పెట్టుకుని చూపరులను ఆకర్షించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top